దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, భాజపా మధ్య విమర్శలు తీవ్రతరమయ్యాయి. షహీన్‌బాగ్ నిరసనల్లో కాల్పులకు పాల్పడిన వ్యక్తికి ఆప్‌తో సంబంధాలున్నట్లు విచారణలో తెలిసిందని దిల్లీ పోలీసులు తెలిపిన తర్వాత ఆప్ పై మాటల యుద్ధానికి దిగింది భాజపా. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయాన్ని ఓడించేందుకు దిల్లీని కేజ్రీవాల్ రణరంగంగా మారుస్తారా? అని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశ్నించారు.
దిల్లీ దంగల్: షహీన్‌బాగ్ ఘటనపై ఆప్, భాజపా మాటల యుద్ధం - shaheen bagh shooter news
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు రెండు రోజులే మిగిలి ఉన్న తరుణంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, భాజపా మధ్య మాటల యుద్ధం తీవ్రతరమైంది. షహీన్‌బాగ్‌లో కాల్పులకు తెగించింది ఆప్ కార్యకర్తే అని పోలీసులు ధ్రువీకరించిన నేపథ్యంలో.. ప్రధాని మోదీ-అమిత్ షా ద్వయాన్ని ఓడించేందుకు దేశరాజధానిని కేజ్రీవాల్ రణరంగంగా మారుస్తారా? అని ప్రశ్నించారు భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా. ఇదే అంశంపై స్పందించిన దీల్లీ సీఎం కేజ్రీవాల్.. కాల్పులు జరిపిన వ్యక్తికి ఆమ్ ఆద్మీ పార్టీతో సంబంధాలుంటే కఠిన శిక్ష విధించాలని స్పష్టం చేశారు.
ఈ ఆరోపణలను దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఖండించారు. దిల్లీలో తాను చేసిన అభివృద్ధిని ఓర్వలేకే భాజపా, కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఏకమయ్యాయని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీ.. దిల్లీ పోలీసులను ఆప్ పార్టీకి వ్యతిరేకంగా పని చేయిస్తోందన్నారు. వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడారు. ఆప్ పార్టీకి షహీన్‌బాగ్ ఘటనకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. ఒకవేళ అలా రుజువైతే అతనికి కఠినశిక్ష విధించాలని స్పష్టం చేశారు.
" మమ్మల్ని విమర్శించడానికి భాజపా వద్ద ఏ కారణం లేదు. దిల్లీలో జరిగిన అభివృద్ధిపై వాళ్లు ఏమీ మాట్లాడలేరు. ఆప్‌ను ఓడించడానికి అన్ని పార్టీలు ఏకమయ్యాయి. భాజపా, ఎల్జేపీ, ఆర్జేడీ, జేడీఎస్, కాంగ్రెస్, అకాలీదళ్, బీఎస్పీ అన్ని పార్టీలకు కేజ్రీవాల్ ఓటమే లక్ష్యం. దిల్లీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నాయి. వాళ్లు అనుకున్నది జరగలేదు. 200 మంది ఎంపీలు, 70మంది మంత్రులు, 11మంది ముఖ్యమంత్రులు, అమిత్ షా చేసిన వ్యూహాలు ఫలించలేదు. అందుకే దుష్ప్రచారం ప్రారంభించారు. కేజ్రీవాల్ ఉగ్రవాది, విద్రోహి, రావణుడు, దేశద్రోహి అని ఆరోపించారు. అదీ ఫలితాన్నివ్వలేదు. చివరకు దిల్లీ పోలీసులను వినియోగించుకుంటున్నారు. షహీన్‌బాగ్ ఘటనకు మేమే కారణమని ఆరోపిస్తున్నారు. అలా చేసే అధికారం మాకు ఉందా? అలాంటి పని చేస్తామా? "
-అరవింద్ కేజ్రీవాల్, దీల్లీ ముఖ్యమంత్రి.