తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కూరగాయలే తారాజువ్వలు...ప్రభుత్వాల నిష్క్రియాపరత్వం - కూరగాయలే తారాజువ్వలు...ప్రభుత్వాల నిష్క్రియాపరత్వం

దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తున్నామంటున్న పాలకుల మాటల్లో డొల్లతనాన్ని ఉల్లిగడ్డల కొరత, ధరల మంట బట్టబయలు చేస్తున్నాయి. నిత్యావసరాల్లో అత్యంత కీలకమైన ఉల్లి ధరలు ఆకాశాన్నంటడం కొన్నేళ్లుగా ఏదో ఒక సమయంలో దేశ ప్రజలను ఇబ్బంది పెడుతున్న అంశం. కూరగాయల సాగు, దిగుబడులు, ఉత్పాదకత పెంపు విషయంలో ప్రణాళికల వైఫల్యాలెలా ఉన్నాయో చెప్పడానికి ఉల్లిగడ్డల కొరత తాజా దృష్టాంతం.

onion_
కూరగాయలే తారాజువ్వలు...ప్రభుత్వాల నిష్క్రియాపరత్వం

By

Published : Dec 9, 2019, 7:34 AM IST

Updated : Dec 9, 2019, 8:11 AM IST

దేశ వ్యాప్తంగా ఉల్లిపాయ ధరలు ఆకాశాన్నంటాయి. కనీవినీ ఎరగని రీతిలో భగ్గుమంటున్నాయి. అత్యధికంగా ఉల్లిగడ్డలు పండించే మహారాష్ట్రలో సైతం ఉల్లి ధరలు ప్రజలకు చుక్కలు చూపుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు నిర్దిష్ట కార్యాచరణ లేకపోవడం బాధాకరం. అత్యధికంగా ఉల్లిగడ్డలు పండించే మహారాష్ట్రలోనే కొన్ని మార్కెట్లలో క్వింటాలు ఉల్లి ధర రూ.11,300కు చేరింది. దేశంలోనే అతిపెద్దదైన లాసల్‌గామ్‌ ఉల్లి విపణిలో 72 ఏళ్ల చరిత్రలో అత్యధిక ధర నమోదైంది. మనదేశంలో ఒక రాష్ట్రమంత కూడా లేని టర్కీ, నెదర్లాండ్స్‌, ఈజిప్ట్‌ వంటి దేశాల నుంచి ఉల్లిగడ్డలను దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి దాపురించింది.

ఉత్పాదకత విషయంలో వైఫల్యాలు

ఏటా శీతకాలంలో ఉల్లిగడ్డలు, వర్షకాలం ఆరంభంలో కూరగాయల ధరలు అమాంతం పెరగడం సర్వసాధారణమైంది. ప్రతి సీజన్‌లో ఏదో ఒక కూరగాయ ధర దేశంలో మండిపోతూ ఉంటుంది. ఉల్లిగడ్డల సాగు, దిగుబడి తగ్గుతుండటంవల్ల కొరత ఏర్పడుతోంది. ఈ పరిణామాలు ధరలపై ప్రభావితం చూపుతున్నాయని కేంద్రం తాజాగా పార్లమెంటులో పేర్కొంది. ప్రణాళికాబద్ధంగా సాగు, దిగుబడులు పెంచుతున్నామని చెబుతున్న పాలకుల మాటలు వాస్తవమే అయితే ధరల పెరుగుదల ఎందుకనేది సర్వత్రా తలెత్తుతున్న ప్రశ్న.

రైతులకు దక్కని సాయం

కూరగాయల రైతులంటే ప్రభుత్వాలకు ఎంతో చిన్నచూపు ఉంది. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించే 24 పంటల్లో ఒక్క కూరగాయా లేదు. దిగుబడులు పెరిగినప్పుడు ధర రాక రైతులు కూరగాయలను పారేస్తున్నారు. పంట సరిగ్గా రాకపోతే ప్రజలకు ధరల మంట తప్పడంలేదు. ఉల్లి, టమోటాల ధర ఒక్కో సీజన్‌లో కిలో రూపాయికి పడిపోయి, రైతులు కడుపు మండి రోడ్లపై పారబోస్తున్నారు. ఇప్పుడు కిలో రూ.150 దాటిన ఉల్లి ధర సరిగ్గా 110 రోజుల క్రితం దీంట్లో పదోవంతైనా లేదు. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కురిసిన అధిక వర్షాలకు దేశవ్యాప్తంగా 1.59 కోట్ల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ వెల్లడించింది. వీటిలో ఉల్లి కూడా ఉంది.

గణాంకాలు

దేశంలో ఉల్లి శుద్ధి, నిల్వల గురించి రాష్ట్రాలేవీ పట్టించుకోవడం లేదు. కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలను ఉద్యాన పంటల జాబితాలో కేంద్రం చేర్చింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ పంట దిగుబడుల వార్షిక వృద్ధిరేటు 2010-11లో 7.82 శాతముంటే 2017-18లో 2.05 శాతానికి పడిపోయిందని జాతీయ ఉద్యాన మండలి(ఎన్‌హెచ్‌బీ) తాజాగా వెల్లడించింది. ఉద్యాన పంటల్లో కూరగాయల శాతం 60 నుంచి 59కి తగ్గింది. ఉల్లి సాగు విస్తీర్ణం 2016-17తో పోలిస్తే 2018-19లో 13.06 లక్షల హెక్టార్ల నుంచి 12.93 లక్షల హెక్టార్లకు పడిపోయింది. ఈ గణాంకాలన్నీ కేంద్రం అధికారిక నివేదికల్లో వెల్లడించిన సత్యాలే.

దేశ ప్రజలకు నిత్యం పోషకాహారం అందాలంటే రోజుకు 300 గ్రాముల కూరగాయలు తినాలన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు. కానీ, 130 కోట్ల మంది ప్రజలకు అవసరమైన కూరగాయల కొరత పెద్ద సమస్యలా మారింది. నిరుడు భారత్‌లో మొత్తం 18.74 కోట్ల టన్నుల కూరగాయలు పండాయి. అందులో 58 శాతం(11 కోట్ల టన్నులు) కేవలం నాలుగు రకాలే ఉన్నాయి. వాటిలో ఆలుగడ్డలు 27శాతం, టమోటా, ఉల్లి చెరి 12, వంకాయ ఏడు శాతం చొప్పున ఉన్నాయి. ఉత్తరాదిన ఆలుగడ్డలను మద్దతు ధరతో కొనేందుకు హరియాణా వంటి రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఆలుగడ్డ ధర పడిపోతే అక్కడి రైతులను ఆదుకునేందుకు ఉత్తరాది రాష్ట్రాలు వెంటనే రంగంలోకి దిగుతున్నాయి. కానీ, దేశంలోకెల్లా అత్యధికంగా టమోటాలు పండించే తెలుగు రాష్ట్రాల రైతులకు అలాంటి మద్దతు కరవైంది.

అందని ప్రోత్సాహాలు

బహుళజాతి సంస్థలు కిలో టమోటా సంకరజాతి విత్తనాలను రైతులకు లక్ష రూపాయల వరకు విక్రయిస్తున్నాయి. అవే విత్తనాలతో పండించే పంటను పట్టుమని కిలో పది రూపాయలకైనా కొనే నాథుడే లేని రోజులు ఏడాదిలో సగానికి పైగా ఉంటున్నాయి. తెలంగాణకు నిత్యం ఉత్తరప్రదేశ్‌ మొదలుకుని తమిళనాడు దాకా పలు రాష్ట్రాల కూరగాయలు వస్తే తప్ప ఇక్కడి ప్రజల అవసరాలు తీరవు. ఇతర పంటల విత్తనాల ధరలో 50 శాతం వరకు రాయితీ ఇస్తున్న ప్రభుత్వాలు కూరగాయల పంటలకైతే ఒక్కశాతం రాయితీనైనా ఇవ్వడంలేదు. ఆలుగడ్డలు, ఉల్లి వంటివి తెలుగు రాష్ట్రాల్లో బాగా పండించడానికి అనువైన వాతావరణం ఉంది. సారవంతమైన భూములూ ఉన్నాయి. అయినా ప్రభుత్వాల నుంచి రైతులకు ప్రోత్సాహం కరవైంది. దీనివల్లే తెలుగు ప్రజలు నిత్యం ఉత్తర్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి కూరగాయలకోసం ఎదురుచూడాల్సి వస్తోంది. చిలీ లాంటి చిన్నదేశంలో కేవలం 7,800 మంది రైతులు పండించే పంటలను 835 సంస్థలు 100 దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.

ఇందులో 74 రకాల పండ్లు, కూరగాయలు ఉన్నాయి. మొత్తం ప్రపంచ కూరగాయల దిగుబడిలో చైనా 53 శాతంతో ప్రపంచాన్ని శాసిస్తోంది. 15 శాతం వాటాతో భారత్‌ ఆపసోపాలు పడుతోంది. పలు దేశాలు నాణ్యమైన కూరగాయల కోసం భారత్‌వైపు చూస్తున్నాయి. అంతర్జాతీయ విపణిలోకి మొత్తం దేశాల ఎగుమతుల్లో భారత్‌ వాటా 1985లో 1.4 శాతం ఉండగా, 2016లోనూ అంతే ఉందని ఎన్‌హెచ్‌బీ స్పష్టం చేసింది. భారత్‌లో మొత్తం కూరగాయల దిగుబడుల్లో 27 శాతం వాటాతో ఆలుగడ్డలు అగ్రస్థానంలో ఉన్నాయి. భారత్‌ నుంచి ఎగుమతి అవుతున్నవి 0.5 శాతమే. ఇండియాలోని ఒక పెద్ద నగరమంత కూడా లేని నెదర్లాండ్స్‌ ప్రపంచ ఆలుగడ్డల ఎగుమతిలో 22.5 శాతంతో అంతర్జాతీయ విపణిని శాసిస్తోంది. మనదేశంలో పండే కరివేపాకు, ఉల్లిసహా పలురకాల కూరగాయలను కొనడానికి ఐరోపాతో పాటు పలు దేశాలు సిద్ధంగా ఉన్నాయి. కానీ, భారత ప్రజల అవసరాలకు ఉల్లిని ఈజిప్టు వంటి దేశాల నుంచి పాలకులు తెప్పిస్తున్నారు.

కనీస అవగాహన అవసరం

ఉల్లిగడ్డ సహా ఇతర కూరగాయల కొరత తీరాలంటే కనీసం పదేళ్ల భవిష్యత్‌ అవసరాలపై పాలకులకు అవగాహన ఉండాలి. ఏటా పెరుగుతున్న జనాభా మేరకు దిగుబడులు నమోదు కావడం లేదు. 2050నాటికి దేశ ప్రజల అవసరాలకు 30 కోట్ల టన్నుల కూరగాయలు అవసరమని కేంద్ర ఉద్యాన మండలి వెల్లడించింది. ప్రస్తుతమున్న 18 కోట్ల టన్నులకు అదనంగా 66 శాతం దిగుబడి అధికమైతే తప్ప, అప్పటి అవసరాలు తీర్చలేమని గుర్తించాలి. కానీ, ఏటికేడు దేశంలో ఆహార పంటల విస్తీర్ణం తగ్గిపోతోంది. రైతులు వాణిజ్య పంటల వైపు మళ్లుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏటా 60 లక్షల ఎకరాల్లో పత్తిని వేస్తున్న రైతులు, అందులో పదో వంతైనా ఉల్లిగడ్డ సాగుచేయడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 10 కోట్ల జనాభాకు అవసరమైన ఉల్లి, ఇతర కూరగాయలేవీ పూర్తిస్థాయిలో ఇక్కడ పండటం లేదు.

స్వయం సమృద్ధి అవసరం

భారత్‌లో ప్రధాన నగరాల చుట్టూ వంద కిలోమీటర్ల పరిధిలో కూరగాయల సాగే అధికంగా ఉండాలని ఏడేళ్ల క్రితమే కేంద్రం ప్రణాళిక రూపొందించి నిధులిచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో విశాఖ, తిరుపతి, విజయవాడ, హైదరాబాద్‌ వంటి నగరాలను ఇందుకు ఎంపిక చేశారు. ఇప్పటికీ ఈ నగరాలకు కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి వస్తే తప్ప కడుపు నిండే పరిస్థితి లేదు. కేంద్రం నుంచి నిధులు రానిదే కూరగాయల రైతులకు ఎలాంటి సాయం అందడం లేదు. విత్తన రాయితీ లేదు. అధిక దిగుబడినిచ్చే వంగడాలు రావు. ఉద్యాన విశ్వవిద్యాలయాలున్నా స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పండే, అధిక దిగుబడినిచ్చే వంగడాలు ఇవ్వడం లేదు. ఒకటిన్నర దశాబ్దం క్రితం దేశంలో ఉల్లిగడ్డల ధరలు అకస్మాత్తుగా పెరగడంతో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఉల్లినిల్వ గోదాములను అక్కడక్కడ నిర్మించింది. అవి శిథిలమై నిరుపయోగమయ్యాయి. పలు దేశాల్లో ఉల్లి నిల్వ, శుద్ధికి ఆధునిక సదుపాయాలున్నాయి. వాటిపై అధ్యయనం చేసి, ఇక్కడి రైతులకూ వాటిని అందుబాటులోకి తేవాలి.

రాయితీలిచ్చే విధానాలు మారాలి

దేశానికి ఆహార భద్రత కల్పించే పథకాలకు ఏటా వేలకోట్ల రూపాయలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చిస్తున్నా వాటిలో ఉల్లిగడ్డ వంటి పంటలకు ఒక్కశాతమైనా దక్కడం లేదు. జాతీయ ఆహార భద్రత మిషన్‌ పథకాన్ని ఎన్నో ఏళ్లుగా అమలుచేస్తున్నా అందులో కూరగాయలకు చోటు లేకపోవడం పెద్దలోపం. వరి, గోధుమ, పప్పుధాన్యాల పంటలనే ప్రామాణికంగా తీసుకుని వాటికే రాయితీలిచ్చే విధానాలు ఇకనైనా మారాలి. ఉల్లిగడ్డల బదులు ఉల్లి రసం, పొడులను చేసి వాడుకోవచ్చన్న నిపుణుల సూచనలను ప్రోత్సహించాలి. తద్వారా ధరలు పెరిగినప్పుడు విదేశాల నుంచి దిగుమతులను తగ్గించవచ్చు. ఇప్పటికే వంటనూనెల దిగుమతులకు ఏటా రూ.75 వేలకోట్లు వెచ్చిస్తున్నాం. ప్రస్తుత విధానాలిలాగే కొనసాగితే జనాభా అవసరాలు తీర్చడానికి ఉల్లితో పాటు ఇతర కూరగాయలనూ విదేశాల నుంచి కొనాల్సివస్తుంది.

2015-19 మధ్య నాలుగేళ్లలో దేశంలో ఉల్లిగడ్డల వార్షిక దిగుబడి అదనంగా 27 లక్షల టన్నులు పెరిగినట్లు ఎన్‌హెచ్‌బీ తెలిపింది. ఇదే కాలవ్యవధిలో దేశజనాభా అదనంగా నాలుగు కోట్లకు పైగా పెరిగింది. మరోవైపు దిగుబడి తగ్గడంవల్లే ఇప్పుడు ధరలు పెరిగినట్లు కేంద్రం తాజాగా పార్లమెంటులో చెప్పడంతో ఎన్‌హెచ్‌బీ చెప్పే లెక్కలెంత వాస్తవమనే ప్రశ్న తలెత్తుతోంది. ధరలు ఎగబాకిన తరవాత చేపడుతున్న తాత్కాలిక ఉపశమన నిర్ణయాలతో దీర్ఘకాలిక అవసరాలు తీరవు. అవే నిధులను సీజన్‌ ఆరంభంలో రైతులకు ప్రోత్సాహకాలుగా ఇవ్వాలి. పంటలను గిట్టుబాటు ధరలకు కొని- శుద్ధి, నిల్వ సదుపాయాలు సమకూరిస్తే దేశానికే కాకుండా పలుదేశాల అవసరాలు సైతం తీర్చే స్థాయికి భారత్‌ ఎదుగుతుందని పాలకులు గుర్తించాలి.

ఇదీ చూడండి : 'మహిళల్లో విశ్వాసం పెంచేలా పోలీసు సేవలుండాలి'

Last Updated : Dec 9, 2019, 8:11 AM IST

ABOUT THE AUTHOR

...view details