నూతన విద్యా విధానం(ఎన్ఈపీ)లోని సమస్యలను వివరిస్తూ ప్రధాని నరేంద్రమోదీకి 20 మంది ఉపకులపతులు లేఖ రాశారు. ఈ విద్యా విధానం ద్వారా డ్రాపవుట్స్ పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్ఈపీలో లోపాలపై మోదీకి ఉపకులపతుల లేఖ
దేశంలో కొత్తగా ప్రవేశపెట్టిన విద్యావిధానంలో లోపాలున్నాయంటూ 20 మంది ఉపకులపతులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి వివరణాత్మక లేఖ రాశారు. ఈ విధానం వల్ల విద్యార్థులు సమస్యలను ఎదుర్కొంటారని తెలిపారు.
విద్యా విధానం
లేఖ రాసిన వారిలో తమిళనాడులోని పలు విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో పాటు మాజీలూ ఉన్నారు. ఈ లేఖ కాపీని కేంద్ర విద్యాశాఖ మంత్రి, తమిళనాడు సీఎంతోపాటు ప్రతిపక్ష పార్టీ నేతకూ పంపారు. ఉపకులపతులు రాసిన లేఖలో విద్యావిధానంలోని కొన్ని లోపాలున్నాయని వివరించారు.
- ఐదేళ్ల కన్న ముందే చిన్నారులను పాఠశాలకు పంపటం వల్ల వారిపై ప్రభావం చూపిస్తుంది.
- 5, 8వ తరగతుల్లో బోర్డు పరీక్షలు మంచి ఆలోచన కాదు. విద్యా వ్యవస్థలో వృత్తి విద్యను భాగం చేయటం నష్టం కలిగిస్తుంది. ప్రస్తుత విద్యా విధానం నుంచి విద్యార్థులు బయటికి వెళ్లాల్సి ఉంటుంది.
- 5వ తరగతి వరకు ఏకరూప పాఠ్యాంశాలు బోధించటం తప్పనిసరి కాదు. డిగ్రీ విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించటం వారి పై చదువులకు ఆటంకం కలిగిస్తుంది.
- కళాశాలల్లో 5వేల మంది విద్యార్థులకు పరిమితం చేయటం ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య లభించదు.
- సంస్కృతాన్ని ప్రోత్సహించటం ద్వారా స్థానిక భాషల్లో గందరగోళం పెరుగుతుంది.
- రాష్ట్రాల నుంచి పూర్తిగా అధికారాలను స్వీకరించేందుకే కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఇది అన్యాయానికి, అసమానతలు, ఆర్య సంస్కృతికి దారి తీస్తుంది.
ఇదీ చూడండి:అందరికీ అందని ఆన్‌లైన్ బోధన