తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుప్రీం 'అనర్హత' తీర్పుపై భాజపా, కాంగ్రెస్​ 'హర్షం'

కర్ణాటకలో ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం తీర్పును అన్ని పక్షాలు స్వాగతించాయి. సిద్ధరామయ్యతో కలిసి అప్పటి స్పీకర్ రమేశ్​​ చేసిన కుట్రలకు సుప్రీం తీర్పు గట్టి సమాధానమని ముఖ్యమంత్రి యడియూర్పప్ప వ్యాఖ్యానించారు. ఉపఎన్నికల్లో పోటీకి ఎమ్మెల్యేలను అనుమతించడం 'భాజపా ఆపరేషన్​ కమల్'​ను సూచిస్తోందని ఎద్దేవా చేసింది కాంగ్రెస్.

'సుప్రీం 'అనర్హత' తీర్పును స్వాగతిస్తున్నాం.. కానీ'

By

Published : Nov 13, 2019, 3:21 PM IST

కర్ణాటక ఎమ్మెల్యేలపై అనర్హత వేసిన అప్పటి స్పీకర్​ రమేశ్​ కుమార్​ నిర్ణయాన్ని సమర్థిస్తూనే.. వారు ఉపఎన్నికల్లో పోటీ చేయవచ్చని తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును అన్ని పార్టీలు స్వాగతించాయి. రాజకీయ నాయకులుగా.. సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తమకు ఎంతో కీలకమైనదని వ్యాఖ్యానించారు అనర్హత ఎమ్మెల్యేలు.

"ఉపఎన్నికల్లో పోటీ చేయడానికి సుప్రీంకోర్టు అనుమతించడం మాకు చాలా ముఖ్యం. మేం తీర్పును స్వాగతిస్తున్నాం. ఈ తీర్పు మాకు ఎంతో కీలకం."-అనర్హత ఎమ్మెల్యేలు.

అయితే ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారనే విషయంపై ఎమ్మెల్యేలు స్పష్టత ఇవ్వలేదు. కాసేపటికే వారంతా భాజపాలో చేరతారని వార్తలు వెలువడ్డాయి.

కుట్రలకు సమాధానం

అనర్హత ఎమ్మెల్యేలపై సుప్రీం తీసుకున్న నిర్ణయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప స్వాగతించారు. డిసెంబర్​ 5న జరగనున్న ఉపఎన్నికలో భాజపా మొత్తం 15 సీట్లలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

"ఈ తీర్పు కోసం దేశం మొత్తం ఎదురుచూసింది. సిద్ధరామయ్యతో కలిసి అప్పటి స్పీకర్ కుట్రపన్నారు. దానికి ధర్మాసనం సరైన జవాబిచ్చింది. పార్టీ కోర్​ కమిటీ సమావేశంలో చర్చించిన తర్వాత అనర్హత ఎమ్మెల్యేలకు టికెట్లిచ్చే అంశంపై నిర్ణయం తీసుకుంటాం."-యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి.

ఆపరేషన్ కమల్​ను సూచిస్తోంది:కాంగ్రెస్

సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన కాంగ్రెస్​.. కర్ణాటకలో యడియూరప్ప ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసింది.

"సుప్రీంకోర్టు నిర్ణయం రాష్ట్రంలో భాజపా చేపట్టిన 'ఆపరేషన్ కమల్​'ను సూచిస్తోంది. అక్రమ చర్యలకు పాటుపడుతున్న యడియూరప్ప ప్రభుత్వాన్ని తక్షణమే రద్దు చేయాలి. శాసనసభ్యులకు వరాలు ప్రకటించి ప్రభుత్వాన్ని కూల్చడానికి భాజపా ప్రయత్నాలు చేసింది. ఇంత పెద్ద మొత్తంలో నల్లధనం ఎక్కడి నుంచి వచ్చింది? యడియూరప్ప నేరాలపై దర్యాప్తు జరిగి తీరాలి.'-రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిథి.

తీర్పుతో ఉపశమనం: రమేశ్​ కుమార్

సుప్రీం తీర్పుతో ఉసమనం లభించిందని కర్ణాటక మాజీ స్పీకర్​ రమేశ్​ కుమార్​ అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ తాను తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించినందుకు హర్షం వ్యక్తం చేశారు.

"ఎమ్మెల్యేల అనర్హతను సమర్థిస్తూ సుప్రీం నిర్ణయం తీసుకుంది. ఇది నాకు ఎంతో ఉపశమనం కలిగించేదే. అనర్హత కాలంపై సుప్రీం నా నిర్ణయంతో ఏకీభవించలేదు. అయితే సుప్రీం తీర్పును సమగ్రంగా పరిశీలించిన తర్వాత దీనిపై స్పందిస్తాను."-రమేశ్​ కుమార్, కర్ణాటక మాజీ స్పీకర్.

ABOUT THE AUTHOR

...view details