వారణాసికి చెందిన చేనేత కార్మికుడు బచ్చీలాల్.. ప్రధాని నరేంద్ర మోదీ కోసం 15 రోజుల పాటు శ్రమించి ప్రత్యేక వస్త్రాన్ని తయారు చేశాడు. అయోధ్యలో రామమందిర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆగస్టు 5న వస్తున్న ప్రధానికి ఈ వస్త్రాన్ని అందజేయాలని భావిస్తున్నాడు.
వస్త్రాన్ని 'జై శ్రీరామ్-అయోధ్యధామ్' సందేశం, బాణాలతో అలంకరించినట్టు చెప్పాడు బచ్ఛీలాల్. ఎరుపు, బంగారు వర్ణాలు ఉపయోగించినట్టు పేర్కొన్నాడు.
" ఈ వస్త్రం 72 అంగుళాల పొడవు, 22 అంగుళాల వెడల్పు ఉంటుంది. కాటన్, సిల్క్ దారాలతో దీనిని తయారు చేశా. అయోధ్య పోలీస్ కమిషనర్ ద్వారా ఈ వస్త్రాన్ని మోదీకి అందజేయాలనుకుంటున్నా. అయోధ్యలో రామాలయం నిర్మించడం నాకు చాలా ఆనందంగా ఉంది. దీని ద్వారా పర్యటకం పెరిగి వ్యాపారాలు బాగా సాగుతాయి."