తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'టీకాతో కొత్త స్ట్రెయిన్​ నుంచీ రక్ష' - corona new strain

ప్రస్తుతం అభివృద్ది చేస్తున్న కరోనా టీకాలు కొత్త రకం స్ట్రెయిన్​పైనా సమర్థంగా పనిచేస్తాయని ప్రొఫెసర్​ విజయ్​ రాఘవన్ తెలిపారు. వైరస్​ జన్యుక్రమాలపై ఈ టీకాలు ప్రభావం చూపవనేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. భారత్​లో కరోనా జన్యు మార్పులను గుర్తించేందుకు జినోమిక్స్​ కన్సార్టియం ఏర్పాటు చేయడం కీలక పరిణామం అని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది.

Vaccines will work against the variants detected in UK and South Africa
'కొత్త స్ట్రెయిన్​పై పైనా టీకా సమర్థవంతంగా పనిచేస్తుంది'

By

Published : Dec 29, 2020, 5:29 PM IST

Updated : Dec 29, 2020, 7:24 PM IST

బ్రిటన్, దక్షిణాఫ్రికాతో పాటు ఇతర దేశాల్లో వ్యాప్తి చెందుతున్న కరోనా కొత్త రకం స్ట్రెయిన్​పై ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు పని చేస్తాయని కేంద్ర ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్​ కే విజయ​ రాఘవన్​ చెప్పారు. వైరస్ జన్యుక్రమాలపై వ్యాక్సిన్లు ప్రభావం చూపవని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు.

కరోనా జన్యుక్రమాలను గుర్తించేందుకు దేశంలోని 10 ప్రభుత్వ ప్రయోగశాలలతో జినోమిక్స్​ కన్సార్టియం ఏర్పాటు చేయడం కీలక పరిణామమని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్​ అన్నారు. యూకేలో కొత్త రకం కరోనా స్ట్రెయిన్​ వ్యాప్తి గురించి తెలిసే నాటికి భారత్​లో 5వేల జినోమీ సీక్వెన్స్​ పరీక్షలే చేశామని, కన్సార్టియం ఏర్పాటుతో ఆ సంఖ్య ఇప్పుడు మరింత పెరుగుతుందన్నారు.

కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని నీతి ఆయోగ్ సభ్యులు వీకే పాల్​ సూచించారు. దేశంలో ఇంకా మెజరిటీ ప్రజలకు వైరస్ ముప్పు పొంచి ఉందని, శీతకాలంలో మహమ్మారి ఇంకా విజృంభించే అవకాశం ఉందని హెచ్చరించారు.

2.7 లక్షల దిగువకు..

దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2.7లక్షల దిగువకు చేరిందని భూషణ్​ వెల్లడించారు. పాజిటివిటీ రేటు కూడా గతవారం 2.25శాతంగానే నమోదైనట్లు చెప్పారు. లింగ ఆధారంగా కొవిడ్​ కేసుల సంఖ్యను విశ్లేషిస్తే వైరస్​ సోకిన వారిలో 63 శాతం మంది పురుషులు, 37 శాతం మహిళలు ఉన్నట్లు పేర్కొన్నారు.

70 శాతం పురుషులే..

కరోనా మరణాల్లో 45 శాతం మంది 60ఏళ్ల లోపు వారే అని ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం మృతుల్లో 70 శాతం మంది పురుషులే ఉన్నట్లు వెల్లడించింది.

మొత్తం కరోనా కేసుల్లో 17ఏళ్ల లోపు ఉన్నవారు 8 శాతం మంది. 18-25 ఏళ్లున్న వారు 13శాతం మంది. 26-44 ఏళ్ల మధ్య ఉన్నవారు అత్యధికంగా 39శాతం మంది. బాధితుల్లో 45-60 ఏళ్ల వయసున్న వారు 26 శాతం మంది కాగా.. 60 ఏళ్లు పైబడిన వారు 14శాతం మంది ఉన్నట్లు భూషణ్ వివరించారు. దేశంలో కరోనా కొత్త కేసులు 6నెలల తర్వాత 17వేల కంటే తక్కువగా నమోదయ్యాయని, మరణాలు కూడా 300లోపే వెలుగు చూశాయన్నారు.

Last Updated : Dec 29, 2020, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details