ఉత్తరాఖండ్లో అయిదు రోజుల 'బుఢీ దీపావళి' ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వికాస్నగర్లో ఏనుగు, జింక నృత్యాలతో ఆహ్లాదకరంగా సాగాయి ఉత్సవాలు. 'బుఢీ' అంటే పాతది అని అర్థం. చాలా ఏళ్ల నుంచి ఈ పండుగ జరుపుకోవడం కారణంగా దీనికి 'బుఢీ దీపావళి' అని పేరు పెట్టినట్లు స్థానికులు తెలిపారు.
దేశమంతా ఆశ్వయుజ మాసంలో దీపావళి జరుపుకుంటే.. జైన్సార్ బావర్ తెగ గిరిజనులు మాత్రం అందరి కంటే ఒక నెల ఆలస్యంగా దీపాల పండుగ చేసుకుంటారు. ఒకరితో ఒకరు చేతులు కలిపి సంప్రదాయ హరూల్ నృత్యం చేస్తూ.. ఆనందాలు పంచుకుంటారు.
'పూర్వం మా ఆదివాసీల ప్రాంతంలోకి ఓ రాజు చొరబడ్డాడు. అప్పుడు మా గిరిజన రాజు ఆగ్రహించి ఆ రాజుకు చెందిన జింకపై బాణాలు వేసి చంపేశాడు. ఆ తరువాత.. అక్రమంగా మా ప్రాంతంలోకి చొరబడ్డ రాజు.. గిరిజనులను క్షమాపణ కోరాడు. అప్పుడు గిరిజన రాజు మహాసు దేవతను ఆరాధించి, ఆ జింకకు తిరిగి ప్రాణం పోశాడు. అందుకే ఏటా ఆ కథను గుర్తు చేసుకుంటూ.. ఇలా వారి వేషధారణలో దీపావళి పండుగను జరుపుకోవడం మా సంప్రదాయం.'
-రాజేశ్ తోమర్, గ్రామస్థుడు.
కోర్వా గ్రామంలో జరిగే ఈ వేడుకలు చూస్తే ఎవరైనా సరే ఇట్టే ఆకర్షితులవుతారు. ఏనుగు, జింకలపై స్వారీ చేస్తున్నట్లు.. యుద్ధం చేస్తున్నట్లు కత్తులు తిప్పుతూ.. వారి ఘన చరిత్రను స్మరించుకుంటారు. సంప్రదాయ వంటకాలు వండి పంచుకుంటారు. బృంద నృత్యాలు చేస్తూ సంతోషంగా గడుపుతారు.