వాయుగుండం ప్రభావంతో ఉత్తర కర్ణాటకలో కుంభవృష్టిగా వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలకు భారీగా వరద నీరు చేరుతోంది. అనేక ప్రాంతాల్లో ఇళ్లు నీటిలోనే ఉన్నాయి. పంట నష్టం భారీగా సంభవించింది. కల్బురిగి, యాద్గిర్, బీదర్ ప్రాంతాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉందని.. ఆయా గ్రామాల్లో సహాయక చర్యలు చేపడుతున్నామని అధికారులు వెల్లడించారు.
రక్షణచర్యల్లో అధికారులు...
చించోలి తాలుకాలోని చందాపుర్లో 22 మందిని అధికారులు రక్షించారు. బీదర్-చించోలి మధ్య నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద ముగ్గురు బిహార్ కార్మికులను ఒడ్డుకు చేర్చారు. అన్ని ప్రధాన నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు. అనేక గ్రామాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయని.. ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత శిబిరాలకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.