తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా నిర్ధరణకు ఆ​ పరీక్షలే చేయండి: ఐసీఎంఆర్​

కరోనా వైరస్​ నిర్ధరణకు ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలే చేయాలని, వాటి స్థానంలో ర్యాపిడ్​ యాంటీ బాడీ టెస్టులను చేయొద్దని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​).. రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల సీఎస్​లకు లేఖ రాశారు అడిషనల్​ డీజీ తొతేజా. తాము జారీ చేసిన ప్రోటోకాల్​ను అనుసరించాలని స్పష్టం చేశారు.

By

Published : Apr 23, 2020, 6:26 AM IST

Use rapid test kits for surveillance purpose
కరోనా నిర్ధరణకు ఆ​ పరీక్షలే చేయండి: ఐసీఎంఆర్​

కరోనా వైరస్‌ నిర్ధరణ కోసం కేవలం ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలు మాత్రమే చేయాలని, దాని స్థానంలో ర్యాపిడ్‌ యాంటీ బాడీ టెస్టులు చేయవద్దని భారత వైద్య పరిధోధన మండలి(ఐసీఎంఆర్​) రాష్ట్రాలకు మరోసారి సూచించింది. ఐసీఎంఆర్​ డీజీ బలరాం.. 3 రోజుల క్రితం రాష్ట్రాలకు రాసిన లేఖకు అనుగుణంగా సంస్థ అడిషనల్‌ డీజీ జీఎస్‌ తొతేజా.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు మరో లేఖ రాశారు.

కొవిడ్​ రోగ నిర్ధరణ కోసం ముక్కులు, గొంతు నుంచి తీసుకునే స్వాబ్‌ ఆధారంగా ఆర్​టీ-పీసీఆర్​ టెస్టులు మాత్రమే చేయాలని కోరారు. వైరస్‌కు గురైన వ్యక్తి శరీరంలో రోగ నిరోధక శక్తులు- యాంటీబాడీలు ఎంతవరకు తయారయ్యాయని తెలుసుకోవడానికి మాత్రమే యాంటీ బాడీ టెస్టులు చేస్తారని తొతేజా స్పష్టత ఇచ్చారు.

''ప్రపంచవ్యాప్తంగా ఇదే విధానం కొనసాగుతోందని, చాలా రాష్ట్రాలు సొంతంగా యాంటీబాడీ టెస్టు కిట్లు సేకరించినట్లు మాకు తెలిసింది. కొన్ని రాష్ట్రాల విజ్ఞప్తుల మేరకు ఐసీఎంఆర్​ కూడా.. వాటిని అందుబాటులోకి తెచ్చింది. అయితే.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆర్​టీ-పీసీఆర్​ కిట్ల స్థానంలో వీటిని ఉపయోగించకూడదు.''

- తొతేజా, ఐసీఎంఆర్​ అడిషనల్​ డీజీ

క్షేత్రస్థాయిలో ఈ కిట్ల వినియోగం ఎలా జరుగుతోందన్న విషయంపై ఐసీఎంఆర్​.. వివిధ రాష్ట్రాల నుంచి సమాచారం సేకరించి అందుకు అనుగుణంగా రాష్ట్రాలకు సలహాలు ఇస్తున్నట్లు తొతేజా పేర్కొన్నారు. రాష్ట్రాలన్నీ.. ర్యాపిడ్ టెస్టుల వినియోగ విషయంలో ఐసీఎంఆర్​ జారీ చేసిన ప్రోటోకాల్‌ను అనుసరించాలని తొతేజా తన లేఖలో స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details