భారత్- చైనా మధ్య శనివారం జరిగే ఉన్నతస్థాయి సైనికాధికారుల సమావేశంలో సైనికుల మధ్య ఘర్షణే ప్రధాన అజెండా కానుందని విశ్వసనీయవర్గాల సమాచారం. వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాల సైనికుల ఘర్షణలో 100 మందికిపైగా గాయపడ్డారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వీరి ఆరోగ్య పరిస్థితి అంశాన్ని ఈ భేటీలో భారత ప్రతినిధుల బృందం లేవనెత్తనుందని సమాచారం.
తూర్పు లద్ధాఖ్లోని పాంగోంగ్ సో సరస్సు వద్ద మే 5,6 తేదీల్లో భారత జవాన్లు, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మధ్య ఘర్షణ చెలరేగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇరుదేశాల సైనికులు పిడిగుద్దులు కురిపించుకున్నారు. రాళ్లు విసిరారు, పదునైన ఇనుప వస్తువులతో దాడి చేసినట్లు ఈ వీడియోల ద్వారా తెలుస్తోంది.
"పదునైన ఆయుధాలు, రాళ్లతో దాడి చేయటం అసాధారణ చర్య. దీన్ని ఆమోదించే ప్రసక్తే లేదు. భారత్- చైనా మధ్య శనివారం జరిగే సైనిక అధికారుల భేటీలో దీని ప్రస్తావన తప్పకవస్తుంది. సైనికులందరూ లద్ధాఖ్లోనే చికిత్స తీసుకున్నారు. కొంతమందికి గాయాలు చాలా తీవ్రంగా ఉన్నాయి."
- సీనియర్ సైనికాధికారి
మరోవైపు.. గాల్వన్ లోయలో ఇరువైపుల సైన్యం ఒక కిలోమీటర్ వెనక్కి జరిగినట్లు తెలుస్తోంది. వివాదమేమీ లేనప్పటికీ సమావేశానికి ముందు ఈ చర్య కీలకాంశంగా మారింది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపేందుకు సంకేతంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇతర కీలకాంశాలు..
- ఇరువైపులా ఘర్షణల పూర్వస్థితికి బలగాల స్థానాన్ని మార్చటం
- ముఖాముఖి స్థావరాల వెనుకభాగంగా ఏర్పాటు చేసిన అదనపు బలగాలను తొలగించటం
- భారీ వాహనాలు, ఆయుధాలను వెనక్కి తీసుకెళ్లటం
ఎవరెవరు వెళ్తారంటే..
భారత్ తరఫున 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, పాంగోంగ్ సో, దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతాల బ్రిగేడ్ కమాండర్లు, స్థానిక బలగాల కల్నళ్లతో పాటు ఒక ట్రాన్స్లేటర్ (అనువాదం చేసే వ్యక్తి) ఉంటారు.