అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ భారత్‌కు సోమవారం విచ్చేయనున్నారు. భారత్, అమెరికా మంత్రుల మంగళవారం జరిగే 2+2 చర్చల్లో ఇరువురు పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు వారం రోజుల సమయం మిగిలుండటం, సరిహద్దులో భారత్-చైనా ఉద్రిక్తతల మధ్య జరగనున్న ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ సమావేశాలు భారత్, అమెరికా మధ్య జరగనున్న మూడో 2+2 చర్చలు కావడం విశేషం. భారత్ తరపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ చర్చల్లో పాల్గొంటారు. కీలకమైన ద్వైపాక్షిక అంశాలతో పాటు, ప్రాంతీయ, అంతర్జాతీయ విషయాలపై నేతలు చర్చించనున్నారు. ఇండో పసిఫిక్‌లో చైనా దురాక్రమణ యత్నాలు, తూర్పు లద్దాఖ్‌లో దుందుడుకు వైఖరి ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఇరుదేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు విడివిడిగానూ సమావేశం కానున్నారు. పాంపియో, ఎస్పర్లు.. ప్రధాని మోదీతో సైతం భేటీ అవుతారని అధికారులు తెలిపారు.