అమెరికా నుంచి మరో కార్గో విమానం గుజరాత్‌లోని అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24న భారత సందర్శనకు రానున్న నేపథ్యంలో... ప్రత్యేక వాహనాన్ని, భద్రత పరికరాలను సీ-17 గ్లోబ్ మాస్టర్ కార్గో విమానంలో తీసుకువచ్చారు.
కార్గో విమానంలో తెచ్చిన ఈ ప్రత్యేక వాహనం ట్రంప్ కాన్వాయ్‌లో భాగమేనని అధికారులు తెలిపారు. తొలిసారి భారత్‌లో పర్యటించనున్న ట్రంప్ కోసం ఇప్పటికే మూడు కార్గో విమానాలు భారత్‌కు చేరుకున్నాయి.
36 గంటలు మాత్రమే
ఫిబ్రవరి 24న యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ తన సతీమణి మెలానియా ట్రంప్‌తో కలిసి భారత్‌కు రానున్నారు. అలాగే ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో పాటు ట్రంప్ కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెడ్ కుష్నర్, పలువురు ఉన్నతాధికారులు రానున్నారు. కేవలం 36 గంటలపాటే ఆయన భారత్‌లో గడపనున్నారు.
పటిష్ట భద్రత కోసం..
అమెరికా అధ్యక్షుడి భద్రత కోసం భారత్‌తో పాటు.. యూఎస్ కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేస్తోంది. అందులో భాగంగా అవసరమైన భద్రతా పరికరాలు, వాహనాలను తీసుకువెళ్లడం సాధారణంగా జరిగేదే.
కొద్ది రోజుల క్రితం యూఎస్ 'మెరైన్ వన్' హెలికాప్టర్ భారత్‌కు చేరుకుంది. ఇది కూడా యూఎస్ కార్గోలో భాగమేనని అధికారులు స్పష్టం చేశారు.
గత సోమవారం భారత్‌కు చేరుకున్న మొదటి సీ-17 గ్లోబ్‌మాస్టర్... వివిధ పరికరాలు, ఒక ఎస్‌యూవీని తీసుకొచ్చింది. దీని తరువాత వచ్చిన మరో రెండు కార్గో విమానాల్లో ఒకటి ఒక పెద్ద ఎస్యూవీ... కమ్యూనికేషన్ ఏజెన్సీ (డబ్ల్యూహెచ్‌సీఏ) రోడ్ రన్నర్ తీసుకొచ్చింది. వీటిని ఫిబ్రవరి 24న ఆశ్వికదళంతో ట్రంప్ చేసే 22 కి.మీ. రోడ్‌షోలో ఉపయోగించవచ్చు.
నమస్తే ట్రంప్..
ట్రంప్.. భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి 'నమస్తే ట్రంప్' కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం అహ్మదాబాద్‌లో కొత్తగా నిర్మించిన మోటేరా స్టేడియంలో జరగనుంది. ఈ మైదానంలో ఒకేసారి 1.10 లక్షల మంది కూర్చోవచ్చు. ఈ భారీ కార్యక్రమానికి 10 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ట్రంప్‌కు దిల్లీలో ప్రత్యేక విందు- మెనూ చాలా స్పెషల్