అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి భారత పర్యటనకు వస్తున్న సందర్భంగా ఐటీసీ మౌర్య రెస్టారెంట్ 'బుఖారా' తనదైన వంటకాలతో విందు ఏర్పాట్లు చేస్తోంది. అధ్యక్షుడికి నచ్చేలా పసందైన రుచులతో 'ట్రంప్ తాలీ'ని అందించేందుకు సన్నాహాలు చేస్తోంది.
అదే బుఖారా ప్రత్యేకత!
బుఖారా రెస్టారెంట్ అమెరికా మాజీ అధ్యక్షులు సహా ఎన్నో దేశాల అధినేతలకు ఆతిథ్యమిచ్చింది. అయితే ఈ ప్రఖ్యాత రెస్టారెంట్ గత 41 ఏళ్లుగా తన మెనూను మార్చకపోవడం విశేషం.
అమెరికా అధ్యక్షుడి కోసం చేసిన ఏర్పాట్లు గురించిగానీ, వడ్డించే ఆహారం (మెనూ) గురించి గానీ ఈ రెస్టారెంట్ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
ఒబామా ప్లేటర్
బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడి హోదాలో 2010, 2015లో రెండు సార్లు భారతదేశాన్ని సందర్శించారు. అప్పుడు కూడా బుఖారా రెస్టారెంట్ ఆయనకు 'ఒబామా తాలీ' అందించింది. ఇందులో తందూరీ జింగా, మచిలి టిక్కా, ముర్గ్ బోటి బుఖారా, కబాబ్‌లు ప్రత్యేకంగా వడ్డించారు. అప్పటి నుంచి ఈ వంటకాలు... ముఖ్య అతిథుల ప్రధాన మెనూలో ఒక భాగంగా మారిపోయాయి.
అమెరికా మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా ఎంపిక చేసిన కొంతమంది వ్యక్తులకు ఈ రెస్టారెంట్లోనే ప్రైవేటు విందు కూడా ఇచ్చారు.