భారతీయులంతా సంప్రదాయబద్ధంగా దీపావళి వేడుకలు జరపుకోవడం సహజం. ఎందుకంటే అది మన ఆచారం కనుక. మరి విదేశీయులు మన సంప్రదాయ దుస్తుల్లో సంబరాలు చేసుకుంటే... విశేషమే కదా! అదీ మన బాలీవుడ్ పాటలకు చిందులేస్తూ జరుపుకుంటే ఇంకా చూడముచ్చటగా ఉంటుంది. దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో శనివారం అదే జరిగింది.
దేశవ్యాప్తంగా ప్రజలు దీపావళి సంబరాలు ఆదివారం జరుపుకొంటుంటే.. అమెరికా రాయబార కార్యాలయంలో మాత్రం ఓ రోజు ముందుగానే వేడుకలు ప్రారంభమయ్యాయి. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఉత్సవాలకు సంబంధించిన వీడియోని వారు ట్వీట్ చేశారు. అది కాస్త ప్రస్తుతం వైరల్‌గా మారింది.
అదిరేటి స్టెప్పు మేమేస్తే..
ఈ వీడియోలో బాలీవుడ్ చిత్రం ‘సత్యమేవ జయతే’లోని దిల్‌బర్ పాటకి అమెరికన్ మహిళా సిబ్బంది చేసిన నృత్యాలు ఆకట్టుకుంటున్నాయి. పాటకు అనుగుణంగా వారు వేసిన స్టెప్పులు అక్కడి వారిని ఆకట్టుకున్నాయి. దీంతో ఈలలు వేస్తూ వారిని ఉత్సాహపరిచారు. ఇలా తాముంటున్న దేశ ఆచారాలను గౌరవిస్తూ.. సంబరాల్లో మునిగితేలడం నిజంగా గొప్ప విషయమే కదా!. భారతీయులంతా పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ వారు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రశంసల జల్లు
ఇక ఈ వీడియోపై ట్విట్టర్‌లో నెటిజన్లు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. భారతీయుల సంప్రదాయాలను గౌరవిస్తూ దీపావళి వేడుకలు జరుపుకొంటున్న అమెరికన్లది నిజంగా గొప్ప మనసంటూ అభినందనల్లో ముంచెత్తుతున్నారు. మరికొంత మంది వారు చేసిన స్టెప్పులపై ప్రశంసలు కురిపిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి:దీపావళి శుభాకాంక్షలు తెలిపిన వివిధ దేశాధినేతలు