బాలీవుడ్ అందాల తార ఊర్మిళా మతోండ్కర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు. దిల్లీలో రాహుల్‌తో సమావేశం అనంతరం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు ఊర్మిళ. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ఊర్మిళకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఉత్తర ముంబయి నియోజకవర్గం నుంచి ఊర్మిళ లోక్‌సభ బరిలో నిలిచే అవకాశం ఉంది.
కాంగ్రెస్‌లో చేరిక సందర్భంగా పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని పొగడ్తల్లో ముంచెత్తారు ఊర్మిళ. దేశానికి ప్రస్తుతం రాహుల్ వంటి నాయకుడి అవసరం ఉందన్నారు. గత ఐదేళ్లుగా భావప్రకటనా స్వేచ్ఛకు భంగం వాటిల్లుతోందని ఆరోపించారు ఈ అందాల తార. ప్రజల పక్షంలో నిలిచి పోరాడేందుకే రాజకీయాల్లో అడుగుపెట్టానని చెప్పారు.
రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ఊర్మిళ "నా వ్యక్తిత్వం మహాత్మగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ సిద్ధాంతాలతో ఏర్పడింది. అన్నింటికంటే పెద్ద అంశం స్వేచ్ఛ. ఏం చేయాలనుకున్నా.. ఏదైనా చెప్పాలనుకున్నా... ఎలాంటి జీవితం జీవించాలనుకున్నా స్వేచ్ఛ అవసరం. ఆలోచించే స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ అవసరమనిపిస్తోంది. వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యే పరిస్థితులు ప్రస్తుతం దేశంలో నెలకొన్నాయి. భారత్‌లోని పౌరుల మనసుల్లో అనేక ప్రశ్నలున్నాయి. వారి తరఫున పోరాడేందుకే నేను రాజకీయాల్లోకి వస్తున్నా. సినీ తారలు రాజకీయాల్లోకి వస్తే వారి గ్లామర్ కోసం, వారి పేరు కోసం, ప్రజల్ని తమ వైపు లాక్కునేందుకే అనుకుంటారు. అలా ఆలోచించడం తప్పేమీ కాదు. నా విషయంలో దయచేసి ఆలోచించొద్దు. ఎన్నికలు వచ్చినందుకు నేను పార్టీలో చేరలేదు. ఎన్నికల అనంతరం నేను పార్టీని విడిచిపోను. నేను కాంగ్రెస్‌లో ఉండేందుకే వచ్చాను. కాంగ్రెస్ సిద్ధాంతాల్ని నమ్మే పార్టీలో చేరాను."
-ఊర్మిళ, బాలీవుడ్ నటి