తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వారెంటు లేకుండానే అరెస్టు చేసేయొచ్చు! - ప్రైవేటు వ్యక్తులకు పోలీసుల సేవలు ఉత్తర్​ప్రదేశ్

వారెంట్లు లేకుండానే నేరుగా అరెస్టు చేసే అధికారాన్ని పోలీసులకు కల్పించే వివాదాస్పద నిర్ణయాన్ని యూపీ ప్రభుత్వం తీసుకుంది. ఈ మేరకు పోలీసు శాఖలో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసింది. రుసుం చెల్లిస్తే ప్రైవేటు వ్యక్తులకూ ఈ సేవలను అందించనున్నట్లు తెలిపింది.

UP's New Special Security Force Can "Search, Arrest Without Warrant"
వారెంటు లేకుండానే అరెస్టు చేసేయొచ్చు!

By

Published : Sep 16, 2020, 5:38 AM IST

Updated : Sep 16, 2020, 6:31 AM IST

వారెంట్లు, న్యాయస్థానం నుంచి ఆదేశాలు, ఎఫ్​ఐఆర్ వంటివేమీ లేకుండా నేరుగా ఎవరినైనా అరెస్టు చేసే అధికారాన్ని పోలీసులకు కల్పించే వివాదాస్పద నిర్ణయాన్ని ఉత్త్​ప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. దీనికోసం 'ప్రత్యేక భద్రత దళం'(ఎస్ఎస్ఎఫ్) ఒకటి యూపీ పోలీసు శాఖలో ఏర్పాటయింది. ఎవరినైనా అరెస్టు చేయడానికి, వారి ఇళ్లలో/కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడానికి పోలీసు శాఖలోని ఇతర ఏడు విభాగాలకు లేని అధికారాలను ఈ విభాగానికి ఇచ్చారు.

అరెస్టు చేయడానికి తగిన ఆధారం ఆ విభాగం వద్ద ఉంటే రుసుం చెల్లించి ఎస్ఎస్ఎఫ్ సేవల్ని ప్రైవేటు సంస్థలు, కంపెనీలు, వ్యక్తులు కూడా ఉపయోగించుకోవచ్చని యూపీ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి అవినాశ్ అవస్థి తెలిపారు. ప్రైవేటు వారి కోసం విధులు నిర్వహిస్తున్నప్పుడూ ఈ విభాగానికి అవే అధికారాలు ఉంటాయి. ఈ విభాగంలో పనిచేసే ఎవరిపైనా కేసు పెట్టడానికి వీలుండదు. కోర్టులు కూడా ప్రభుత్వ అనుమతి లేకుండా వీరిపై నేరాలను పరిగణనలో తీసుకునే అవకాశం లేదని ప్రభుత్వ ఉత్తర్వులు చెబుతున్నాయి. మూడు నెలల్లో ఎస్ఎస్ఎఫ్ పనిచేయడం ప్రారంభిస్తుంది.

మొదట అక్కడే

ఇటీవల జరిగిన శాసనసభ వర్షాకాల సమావేశాల్లో యోగి ఆదిత్యనాథ్ సర్కారు 'యూపీ ప్రత్యేక పోలీసువిభాగం' బిల్లుకు ఆమోదం తెలిపింది. ఎస్ఎస్​ఎఫ్ కోసం 1918 కొత్త పోస్టులను మంజూరు చేస్తారు. మొత్తం 9919 మంది దీనిలో ఉంటారు. ఐదు బెటాలియన్లతో, అదనపు డీజీపీ నేతృత్వంలో ఇది పనిచేయడానికి తొలి దశలో రూ.1746 కోట్లు ఖర్చవుతుంది.

గతంలో యూపీ కోర్టుల ప్రాంగణాల్లోనే కొన్ని నేరాలు జరగడంతో ఈ బలగాలను అలహాబాద్ హైకోర్టు, లఖ్​నవూ ధర్మాసనం, జిల్లా న్యాయస్థానాల్లో వినియోగించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కార్యాలయాలు, ప్రార్థన మందిరాలు, మెట్రోలు, విమానాశ్రయాలు, బ్యాంకులు, పరిశ్రమల్లోనూ ఎస్ఎస్ఎఫ్ బలగాలను వినియోగిస్తారు.

కోర్టులో సవాల్ చేస్తాం: కాంగ్రెస్

యూపీలో విపక్షాలు, అణగారిన వర్గాల అణచివేతకే ప్రభుత్వం నూతన చట్టాన్ని చేసిందని పీసీసీ అధ్యక్షుడు అజయ్ కుమార్ లాలూ ఆరోపించారు. ఇది 1919 నాటి రౌలత్ చట్టాన్ని తలపిస్తోందని, దీనిని న్యాయస్థానంలో సవాల్ చేస్తామని చెప్పారు. ప్రైవేటువారీకీ పోలీసు సేవలు అందించాలన్న నిర్ణయం విడ్డూరంగా, ప్రమాదకరంగా ఉందని యూపీ మాజీ డీజీపీ అర్వింద్​కుమార్ జైన్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య ప్రయోజనాలను కాపాడే రీతిలో ప్రభుత్వ నిర్ణయం లేదని సమాజ్​వాదీ పెదవి విరిచింది.

Last Updated : Sep 16, 2020, 6:31 AM IST

ABOUT THE AUTHOR

...view details