తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇజ్రాయెల్​ '6th సెన్స్​'తో ప్రమాదాలకు బ్రేక్ - బస్సులు

రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఇజ్రాయెల్​ రూపొందించిన ఓ పరికరాన్ని పరిశీలిస్తున్నారు ఉత్తరప్రదేశ్​ అధికారులు. రాజధాని లఖ్​నవూలో కొన్ని ఏసీ బస్సుల్లో ప్రయోగాత్మకంగా ఈ పరికరాలను అమర్చారు. త్వరలో అన్ని బస్సుల్లో ప్రవేశపెట్టి ప్రమాదాలను నియంత్రిస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సిక్స్త్ సెన్స్​

By

Published : Jul 16, 2019, 10:25 AM IST

Updated : Jul 16, 2019, 10:38 AM IST

'సిక్స్త్ సెన్స్​'తో ప్రమాదాలకు బ్రేక్

రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉత్తరప్రదేశ్​ రాష్ట్ర రవాణా సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం సాంకేతికతపై దృష్టి సారించింది. ఇజ్రాయెల్​ రూపొందించిన 6th సెన్స్​ అనే పరికరాన్ని ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది.

రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణాలపై విశ్లేషించిన అధికారులు.. వాటికి తగిన పరికరం కోసం అన్వేషించారు. రాత్రి వేళల్లో చోదకుడు నిద్రపోవటం, వాహనాలను ఓవర్​టేక్​ చేయటం, అతి వేగం వంటి తప్పిదాలను ముందుగానే గుర్తించే ఇజ్రాయెల్​ పరికరానికి ఓటు వేశారు. ప్రస్తుతానికి లఖ్​నవూలోని అవధ్​ డిపోకు చెందిన ఏసీ బస్సుల్లో ప్రయోగాత్మకంగా అమర్చారు.

"ఈ పరికరంతో మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సాంకేతికత ఇజ్రాయెల్​కు చెందినది. మేం దిగుమతి చేసుకున్నాం. ఈ పరికరానికి ఎస్​ఆర్​టీ రిజిస్ట్రేషన్​ కోసం ప్రయత్నిస్తున్నాం. అనుమతులు రాగానే అన్ని బస్సుల్లో ప్రవేశపెడతాం. ప్రస్తుతం 4 బస్సుల్లోనే అమర్చాం. ఈ పరికరం ధర రూ. 40 నుంచి 50 వేల మధ్య ఉంది. ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తే రాయితీ లభించే అవకాశం ఉంటుంది."

- రవాణా అధికారి, లఖ్​నవూ

ముఖ్యమైన మూడు..

  1. ఓవర్​టేక్​.. సరైన దూరం లేకుండా వేరే వాహనాలను అధిగమించకుండా ఈ పరికరం ఉపయోగపడుతుంది. పక్కన ఉన్న వాహనాల మధ్య దూరాన్ని ఎప్పటికప్పుడు సెన్సార్ల ద్వారా కనిపెడుతుంది. వేరే వాహనంతో సరైన దూరంలో లేకుండా ఓవర్​టేక్​ చేసేందుకు ప్రయత్నిస్తే అలారం మోగుతుంది. అప్పటికీ డ్రైవర్​ స్పందించకపోతే వాహనం బ్రేకులు అటోమేటిక్​గా పడిపోతాయి.
  2. వాహన చోదకుడు నిద్రపోకుండా ఎప్పటికప్పుడు కనిపెట్టుకుని ఉంటుంది. ముఖ్యంగా రాత్రిళ్లు ప్రయాణించేటప్పుడు ప్రతి 5 నిమిషాలకు పరికరంపై ఉన్న బటన్​ను నొక్కాలి. లేదంటే డ్రైవర్​ నిద్రపోతున్నట్లు భావించి... అలారం మోగిస్తుంది. అప్పటికీ స్పందన లేకపోతే బస్సు బ్రేకులు పడి ఆగిపోతుంది.
  3. మితిమీరిన వేగాన్ని ఈ పరికరం అనుమతించదు. డ్రైవర్​ పరిమితికి మించి వేగంతో వెళితే అలారం మోగుతుంది.

ఇదీ చూడండి: పాఠశాలపై పడిన హైటెన్షన్​ తీగ.. 50మందికి గాయాలు

Last Updated : Jul 16, 2019, 10:38 AM IST

ABOUT THE AUTHOR

...view details