ఓ ఒప్పంద ఉపాధ్యాయురాలు ఏక కాలంలో 25 పాఠశాలల్లో విధులు విధులు నిర్వహిస్తూ.. గత కొద్ది నెలలకు గానూ వేతనంగా రూ.కోటి పొందింది. నమ్మశక్యం కాకపోయినా ఇది వాస్తవమేనని అధికారిక వివరాలు స్పష్టం చేస్తున్నాయి.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయ(కేజీబీవీ)లో సైన్స్ టీచర్‌గా ఉన్న అనామికా శుక్లా.. ఆరు జిల్లాల్లోని వివిధ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్నట్లు డేటాబేస్‌లో వివరాలున్నాయి. కొద్ది నెలల్లోనే ఆమె మొత్తం కోటి రూపాయల వేతనం కూడా తీసుకున్నట్లు ఉంది. ఒకప్పుడు రాయ్‌బరేలీ జిల్లాలో విధులు నిర్వహించిన ఆమె, ఇప్పుడు అంబేడ్కర్ నగర్, బాగ్పత్, అలీగఢ్, సహారణ్పుర్, ప్రయాగ్ రాజ్ జిల్లాల్లో ఏకకాలంలో విధులు నిర్వహిస్తున్నట్లు ఉన్న వివరాలు చూసి అధికారులు షాక్‌కు గురయ్యారు.
ఉపాధ్యాయుల హాజరు వివరాలకు సంబంధించి పర్యవేక్షణ ఉన్నా.. ఇది ఎలా సాధ్యమై ఉంటుందని అధికారులు ఆరా తీస్తున్నారు. నిజాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు పాఠశాల విద్య డైరెక్టర్ జనరల్ విజయ్ కిరణ్ ఆనంద్ తెలిపారు.
అలా వెలుగులోకి వచ్చింది...
మానవ్ సంపద్ పోర్టల్‌లోని డిజిటల్ డేటాబేస్‌లో ఉపాధ్యాయుల వ్యక్తిగత వివరాలు, ఉద్యోగంలో చేరిన తేదీ, పదోన్నతి వంటి వివరాలు నమోదు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే వివరాలు పరిశీలిస్తుండగా అనామికా శుక్లా పేరుతో ఉన్న టీచర్ గత ఏడాది కాలంగా 25 పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్నట్లు ఉంది. 2020 ఫిబ్రవరి వరకు మొత్తం వేతనం రూ.కోటికి పైగా తీసుకున్నట్లు తెలిసింది.