తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మారని మృగాళ్లు : ఉన్నావ్​ బాధితురాలికి నిప్పు.. పరిస్థితి విషమం - ablaze news

దేశంలో అత్యాచార, హత్య ఘటనలు నానాటికి పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘటనలపై ఫిర్యాదు చేసే వారి సంఖ్య చాలా తక్కువ. నూటికి ఒక్కోరో ఇద్దరో పోలీసులను ఆశ్రయిస్తే.. బెయిల్​ పై వచ్చిన నిందితులు.. బాధితులపై దాడికి తెగిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఉత్తర​ప్రదేశ్​లో జరిగింది. ఉన్నావ్​ అత్యాచార బాధితురాలు కోర్టుకు వెళుతున్న క్రమంలో ఐదుగురు దుండగులు ఆమెకు నిప్పంటించారు. 90 శాతం కాలిన శరీరంతో ప్రస్తుతం ఆ యువతి ప్రాణాలతో పోరాడుతోంది.

UP rape survivor set ablaze on way to court
ఉన్నావ్​ బాధితురాలికి నిప్పు.. పరిస్థితి విషమం

By

Published : Dec 5, 2019, 6:16 PM IST

Updated : Dec 5, 2019, 7:06 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్​ షాద్​నగర్​ విషాదం నుంచి తేరుకోకముందే ఉత్తర్​ప్రదేశ్​లో మరో ఘోరం జరిగింది. తమపై ఫిర్యాదు చేసిందన్న అక్కసుతో ఉన్నావ్​ అత్యాచార బాధితురాలికి ఐదుగురు దుండగులు నిప్పంటించారు. మార్చిలో ఆమెపై అత్యాచారం చేసి, బెయిల్​పై విడుదలైన నిందితుడు దాడికి యత్నించాడు. ప్రస్తుతం ఈ దుశ్చర్యకు పాల్పడిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

శరీరం కాలుతున్నా..112కు ఫోన్​

దాడి జరిగిన క్రమంలో బాధితురాలు తనను తాను కాపాడుకునేందుకు మంటల్లోనే కిలోమీటరు దూరం పరిగెత్తింది. శరీరం కాలిపోతున్నా.. ధైర్యం కూడగట్టుకుని 112 నంబరుకు ఫోన్‌ చేసి పోలీసులకు చెప్పింది. బాధితురాలు ఫోన్​తోనే అంబులెన్స్​, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

పరిస్థితి విషమం..

బిహార్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని సింధ్​పుర్​ గ్రామంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి శరీరం పూర్తిగా కాలిపోయింది. అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆమెను మెరుగైన వైద్యం కోసం లఖ్​నవూ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 90 శాతం కాలిన గాయాలతో యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

కోర్టుకు వెళుతుండగా..

బాధితురాలి వాంగ్మూలాన్నిసబ్​ డివిజనల్​ మెజిస్ట్రేట్​ దయశంకర్​ పతక్​ ముందు నమోదు చేశారు పోలీసులు. తమ గ్రామం నుంచి రాయ్​బరేలీలోని కోర్టుకు వెళుతున్న క్రమంలో తనపై దాడి జరిగినట్లు బాధితురాలు వెల్లడించింది. తన నివాసానికి సమీపంలోని గౌర మలుపు వద్దకు చేరుకోగానే హరిశంకర్​ త్రివేది, రామ్​ కిశోర్​ త్రివేది, ఉమేశ్​ బాజ్​పేయీ, శివం త్రివేది, శుభం త్రివేదిలు తనకు నిప్పు పెట్టినట్లు పేర్కొంది. శివం, శుభం త్రివేదీలు 2018 డిసెంబర్​లో తనను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసినట్లు పేర్కొంది. ఆ క్రమంలోనే మార్చిలో వారిపై ఎఫ్​ఐఆర్​ నమోదైంది.

నివేదికకు ముఖ్యమంత్రి ఆదేశం...

దేశవ్యాప్తంగా ప్రతిఒక్కరి దృష్టినీ ఆకర్షించిన ఈ ఘటనపై ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ స్పందించారు. ఘటనాస్థలానికి వెళ్లి పూర్తిస్థాయి నివేదికను సాయంత్రంలోపు అందించాలని పోలీసులు, అధికారులను ఆదేశించారు. మెరుగైన వైద్యం అందించాలని.. దాడికి పాల్పడిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

యోగి ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు...

ఉన్నావ్​ బాధితురాలిపై దాడి జరిగిన క్రమంలో యోగి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఉత్తర ప్రదేశ్​లో రోజురోజుకూ ఆడవారిపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఇప్పటికైనా భాజపా ప్రభుత్వం కళ్లుతెరవాలని కాంగ్రెస్​, సమాజ్​వాదీ పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు.

ప్రియాంక గాంధీ ట్వీట్​

"ఉత్తర్​ప్రదేశ్​లో చట్టాలు చాలా బాగా పనిచేస్తున్నాయని కేంద్ర హోంమంత్రి, రాష్ట్ర​ ముఖ్యమంత్రి తరచూ అసత్యాలు చెబుతున్నారు. కానీ ఆడవారిపై రోజూ జరుగుతున్న అరాచకాలు చూస్తుంటే గుండె రగిలిపోతోంది. ఇప్పటికైనా భాజపా నాయకులు కళ్లు తెరవాలి."

- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్​ జాతీయ ప్రధాన కార్యదర్శి.

" ఉన్నావ్​ అత్యాచార బాధితురాలికి నిప్పంటించిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. డీజీపీ రాజీనామా చేయాలి."
-అఖిలేశ్​ యాదవ్​, ఎస్పీ అధినేత.

మహిళా కమిషన్​ లేఖ..

ఘటనపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్​(ఎన్​సీడబ్ల్యూ) ఛైర్​పర్సన్​ రేఖ శర్మ.. యూపీ రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్​కు లేఖ రాశారు. గత మూడేళ్లలో జరిగిన అత్యాచార ఘటనలు, తీసుకున్న చర్యలు, ఇలాంటి ఘటనల్లో బెయిల్​ మంజూరు చేసిన సందర్భాలు వంటి అంశాలతో పూర్తి నివేదిక అందించాలని స్పష్టం చేశారు.

Last Updated : Dec 5, 2019, 7:06 PM IST

ABOUT THE AUTHOR

...view details