రోడ్డు ప్రమాదాల మరణాలు ఆ రాష్ట్రాల్లోనే అధికం - NCRB news
దేశవ్యాప్తంగా గతేడాది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, మిజోరంలోనే అత్యధికంగా ఉన్నట్లు తేలింది. దేశవ్యాప్తంగా మొత్తం 1.54 లక్షల మంది మరణించగా.. యూపీలోనే 37వేల మంది ఉన్నట్లు జాతీయ నేర గణాంకాల విభాగం నివేదిక తేల్చింది.
రోడ్డు ప్రమాదాల మరణాలు ఆ రాష్ట్రాల్లోనే అధికం
By
Published : Sep 6, 2020, 6:45 AM IST
దేశంలో నిత్యం ఏదోచోట రోడ్డు ప్రమాదం జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. 2019లో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, మిజోరం రాష్ట్రాల్లోనే అత్యధికమని జాతీయ నేర గణాంకాల విభాగం(ఎన్సీఆర్బీ) నివేదికలో వెల్లడైంది.
దేశవ్యాప్తంగా..
నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 2019లో మొత్తం 4,37,396 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అందులో 1,54,732 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. 2018తో (4,45,514) పోలిస్తే కొంత మేర ప్రమాదాల్లో తగ్గుదల కనిపించింది. కానీ, మరణాల సంఖ్య 1.3 శాతం మేర పెరిగింది. 2018లో మరణాల సంఖ్య 1,52,780గా ఉంది.
మొత్తం మరణాల్లో ద్విచక్ర వాహనదారులే 38 శాతం (58,747 మంది) ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాతి స్థానంలో లారీ ప్రమాదాల్లో 14.6 శాతం(22,637 మంది), కారు ప్రమాదాల్లో 13.7 శాతం(21,196 మంది), బస్సు ప్రమాదాల్లో 5.9 శాతం(9192 మంది) మరణించారు.
ద్విచక్ర వాహన ప్రమాదాలతో మరణించిన వారి సంఖ్య మహారాష్ట్ర (7137) తొలిస్థానంలో ఉండగా.. ఉత్తర్ప్రదేశ్ (6431) రెండో స్థానంలో ఉంది.