హాథ్రస్ అత్యాచార ఘటనకు సంబంధించి 19 మంది గుర్తు తెలియని వ్యక్తులపై యూపీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనను తప్పుదోవ పట్టించేలా సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై ఈ కేసులు నమోదు చేశారు. దేశ ద్రోహం, కుట్ర కోణం, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం వంటి ఆరోపణలతో వివిధ సెక్షన్ల కింద ఈ కేసులు నమోదయ్యాయి.
తమ ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాల్జేయడం, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఈ కేసులు నమోదు కావడం గమనార్హం. ఇక్కడి చందా పోలీస్ స్టేషన్‌లో ఈ కేసులు నమోదు చేశారు. హాథ్రస్ కేసు విషయంలో యూపీ ప్రభుత్వ ప్రకటనలను మార్చి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తున్న వారిపై ఈ కేసులు నమోదు చేసినట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు. ఐపీసీతో పాటు ఐటీ చట్టాల కింద ఈ కేసులు నమోదు చేశారు.
బాధిత కుటుంబానికి భారీ మొత్తంలో నగదు ఆశ చూపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీవీ ఛానెల్‌కు చెప్పించేలా చేశారని ఓ పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు నమోదు చేసిన అభియోగాల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలోకి దిగనుంది. నగదు అక్రమ చలామణి కింద చర్యలు చేపట్టనున్నట్లు ఈడీ జాయింట్ డైరెక్టర్(లఖ్‌నవూ జోన్) రాజేశ్వర్ సింగ్ తెలిపారు.