భాజపా ఓటమే లక్ష్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో జట్టుకట్టిన సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్... ప్రచార శంఖారావం పూరించాయి. సహారణ్పుర్ దేవ్బంద్లో మొదటిసారి సంయుక్తంగా బహిరంగ సభ నిర్వహించాయి. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఆర్ఎల్డీ అధ్యక్షుడు అజిత్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
భాజపా, కాంగ్రెస్‌లపై విమర్శలతో విరుచుకుపడ్డారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. ప్రభుత్వ సంస్థలను ప్రధాన మంత్రి నేరేంద్ర మోదీ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అవినీతి పతాక స్థాయికి చేరిందని విమర్శించారు. బోఫోర్స్‌తో కాంగ్రెస్, రఫేల్ ఒప్పందంతో భాజపా అపకీర్తిని మూటగట్టుకున్నాయన్నారు.
"భాజపాకు ఈసారి ఓటమి తప్పదు. ఈ ఎన్నికల్లో వాళ్ల నాటకాలను, మభ్యపెట్టే హమీలను ప్రజలు నమ్మరు. ఈసారి చౌకీదార్ కూడా ఓటమి నుంచి కాపాడలేరు. మంచి రోజలు తీసుకొస్తానని ప్రజలను ప్రలోభ పెట్టి, అధికారంలోకి వచ్చాక వారి కోసం ఇప్పటి వరకు ఒక్క కార్యక్రమాన్నీ చేపట్టలేదు."
-మాయావతి, బీఎస్పీ అధినేత్రి
అప్పుడు చాయ్‌వాలా-ఇప్పుడు చౌకీదార్
గత ఎన్నికల్లో ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాల్లో రూ.15లక్షలు జమ చేస్తామన్న మోదీ, ఈ ఎన్నికల్లో అందరినీ చౌకీదార్లను చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు అఖిలేశ్.