అయోధ్య నగరంలో దీపోత్సవ కార్యక్రమం ఈ రాత్రికే గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించనుంది. దీపావళి పండగ సందర్భంగా ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు అయోధ్య నగరంలో ఈ రోజు దీపోత్సవానికి ఏర్పాట్లు చేసింది. 5 లక్షల 51 వేల దీపాలతో అయోధ్య నగరాన్ని అలంకరించాలని సీఎం యోగి నిర్ణయించారు.
గతేడాది ఇదే విధంగా 3 లక్షల దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు నమోదు చేసింది అయోధ్య నగరం. ఈ సారి 45 నిమిషాల్లో ఐదున్నర లక్షల దీపాలు వెలిగించి ఆ రికార్డును బద్దలగొట్టేందుకు సిద్దమైంది. ఇది సాధించడానికి సుమారు 40 వేల లీటర్ల నూనెను సిద్ధంగా ఉంచారు. 5000 మంది స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
యూపీ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇతర మంత్రులు పాల్గొననున్న అయోధ్య దీపోత్సవంలో ఉదయం నుంచే ఊరేగింపు ప్రారంభమైంది. సాకేత్ కళాశాల నుంచి రామకథ పార్కు వరకు సాగనున్న ఈ ఊరేగింపులో దేశంలోని నలుమూలల నుంచి కళాకారులు పాల్గొంటున్నారు.