ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్ ఘటన బాధితురాలి కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను గురువారం.. పోలీసులు అడ్డుకోవడంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ సర్కారు రాహుల్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. పలుచోట్ల కాగడాల ప్రదర్శన నిర్వహించాయి. పోలీసుల తీరుకు నిరసనగా.. ఉత్తర్‌ప్రదేశ్‌లో నిరసనలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్‌శ్రేణులు ఎక్కడికక్కడ ప్రదర్శనలు నిర్వహించి.. అధికారులను ఘెరావ్ చేయాలని సూచించాయి.
లఖ్‌నవూలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లఖ్‌నవూలోని షహీద్ స్మారక్ వద్ద బాధితురాలికి నివాళిగా కొవ్వొత్తులు వెలిగించారు. మీర్జాపూర్, ఉన్నావ్, సీతాపూర్, మావూలోనూ ఆందోళనలు నిర్వహించారు.
రాహుల్, ప్రియాంకల అరెస్టుకు నిరసనగా.. మహారాష్ట్రలో ఆందోళనలు మిన్నంటాయి. మహారాష్ట్ర సచివాలయం వద్ద నిరసనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కారును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:'హాథ్రస్' ఘటనపై యూపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
రాహుల్, ప్రియాంకలపై కేసు నమోదు..
మరోవైపు వ్యక్తిగత దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించలేదని రాహుల్, ప్రియాంక సహా 200 మంది కాంగ్రెస్ నేతలపై ఉత్తర్‌ప్రదేశ్ గౌతమబుద్ద నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 188, 269, 270 సహా అంటువ్యాధుల చట్టం సెక్షన్3 కింద కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.