పౌరసత్వ చట్ట సవరణపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తున్న తరుణంలో.. ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరసనల్లో భాగంగా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన నిరసనకారులపై ప్రతీకారం తీర్చుకుంటామని యోగీ హెచ్చరించారు. నిరసనకారుల ఆస్తులను వేలం వేసి నష్టపరిహారం వసూలు చేస్తామని ప్రకటించారు.
"ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకించే ఉద్దేశంతో కాంగ్రెస్, సమాజ్వాదీ, వామపక్షాలు భారతదేశాన్ని మంటల్లోకి నెట్టేశాయి. లఖ్నవూ, సంభల్లో హింసాత్మక నిరసనలు జరిగాయి. వాటిని తీవ్రంగా పరిగణిస్తాం. ప్రజా ఆస్తులకు నష్టం కలిగించిన ప్రతీ ఒక్కరి ఆస్తులను జప్తు చేస్తాం. నష్టపరిహారం కోసం వాటిని వేలం వేస్తాం. ఆస్తులను ధ్వంసం చేసినవారి దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. వారిపై ప్రతీకారం తీర్చుకుంటాం. నిరసనల పేరిట హింసకు పాల్పడటం ఆమోదయోగ్యం కాదు."-యోగీ ఆదిత్యనాథ్, ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి.