దిశ హత్యాచారం కేసులో బాధితురాలికి న్యాయం జరిగిందంటూ యావత్ దేశం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న వేళ..ఉన్నావ్ అత్యాచార బాధితురాలికి మాత్రం అన్యాయం జరిగింది. కేసు విచారణ కోసం న్యాయస్థానానికి వెళుతూ కాటేసిన కామాంధుల చేతిలోనే మరోసారి దాడికి గురై దిల్లీ సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నావ్ బాధితురాలు తుదిశ్వాస విడిచింది
90 శాతం కాలిన గాయాలతో మృత్యువుతో పోరాడిన బాధితురాలు శుక్రవారం రాత్రి 11.40 నిమిషాలకు మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. నిన్న సాయంత్రం నుంచి ఆమె పరిస్థితి విషమించిందని.. రాత్రి 11 గంటల 10నిమిషాలకు బాధితురాలికి గుండెపోటు వచ్చినట్లు తెలిపాయి. బతికించడానికి శాయశక్తులా కృషిచేసినట్లు పేర్కొన్నాయి.
ఇదీ జరిగింది..
2018 డిసెంబర్‌లో శివమ్ త్రివేది, శుభం త్రివేది అనే ఇద్దరు యువకులు బాధితురాలిపై అత్యాచారం చేశారు. ఆమె తన తల్లిదండ్రులను కలిసి తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఘటనకు సంబంధించి బాధితురాలు చేసిన ఫిర్యాదుపై ఈ ఏడాది మార్చిలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.
అరెస్టయిన నిందితుడికి ఇటీవలే బెయిల్ లభించింది. తమపై కేసు పెట్టిన బాధితురాలిపై నిందితులు కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో కేసు విచారణలో భాగంగా గురువారం రాయ్‌బరేలీలోని న్యాయస్థానానికి హాజరయ్యేందుకు బయలుదేరిన బాధితురాలిని ప్రధాన నిందితులు శివం త్రివేది, శుభం త్రివేదిలతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు దారిలో అటకాయించి కిరోసిన్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు దిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచింది.
ఇదీ చూడండి: 'దిశ'ఎన్‌కౌంటర్‌కు ఓ యజమాని ఫిదా.. రూ.5 లక్షలు విరాళం