తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉన్నావ్​ హత్య కేసు దోషి అతడే.. కానీ చంపాలనుకోలేదట!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్​ అత్యాచార బాధితురాలి తండ్రి హత్య కేసులో భాజపా బహిష్కృత ఎమ్మెల్యే కుల్​దీప్​ సింగ్​ సెంగార్​ను దోషిగా తేల్చింది దిల్లీ కోర్టు. అయితే.. అతను కావాలని చంపలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇప్పటికే ఉన్నావ్​ అత్యాచార కేసులో సెంగార్​ జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు.

Unnao case: Sengar convicted of culpable homicide in death of rape victim's father
సెంగారే దోషి.. కానీ చంపాలనుకోలేదట!

By

Published : Mar 4, 2020, 3:12 PM IST

ఉన్నావ్​ అత్యాచార బాధితురాలి తండ్రి హత్య కేసులో దిల్లీ ప్రత్యేక న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. భాజపా బహిష్కృత ఎమ్మెల్యే కుల్​దీప్​ సింగ్​ సెంగార్​ను దోషిగా తేల్చింది. అయితే.. అతడిని చంపాలనే ఉద్దేశం మాత్రం సెంగార్​కు లేదని అభిప్రాయపడింది కోర్టు.

బాధితురాలి తండ్రి 2018 ఏప్రిల్​ 9న జ్యుడీషియల్​ కస్టడీలో మరణించాడు. తీవ్రంగా కొట్టడం వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు పోస్టుమార్టంలో నిర్ధరణ అయింది.

బాధితురాలి తండ్రి మృతి వెనుక సెంగార్‌ హస్తం ఉందని సీబీఐ బలమైన సాక్ష్యాలను కోర్టు ముందు ప్రవేశపెట్టింది. 55 మంది సాక్షులను కోర్టు ఎదుట హాజరుపరిచింది. మృతుని మామ, తల్లి వాంగ్మూలాలు రికార్డు చేసి న్యాయస్థానానికి సమర్పించింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తాజాగా సెంగార్​ను దోషిగా తేల్చింది.

ఇదివరకే 'ఉన్నావ్'​ అత్యాచారం కేసులో సెంగార్​ జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. 2017లో జరిగిన ఈ ఘటనలో ఈ భాజపా బహిష్కృత ఎమ్మెల్యేకు యావజ్జీవం విధిస్తూ గతేడాది డిసెంబర్​ 20న కోర్టు తీర్పు వెలువరించింది.

ఇదీ చూడండి:ఉన్నావ్​ కేసు: బతికున్నంత కాలం జైల్లోనే సెంగార్​

ఇదీ జరిగింది...

2018 ఏప్రిల్​ 3న బాధితురాలి తండ్రి .. పనిచేసే ప్రదేశం నుంచి తమ ఊరికి వెళ్లే సమయంలో శశిప్రతాప్ సింగ్‌ను లిప్ట్ అడగగా అతడు నిరాకరించాడు. దీంతో ఇరువురిమధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న సెంగార్ తమ్ముడు అతుల్‌ సింగ్ సెంగార్‌.. బాధితురాలి తండ్రిని తీవ్రంగా కొట్టడమే కాకుండా అతడిపైనే పోలీసులకు కేసు పెట్టాడు.

బాధితురాలి తండ్రిని అదుపులోకి తీసుకోగా పోలీసులకు ఎమ్మెల్యే సెంగార్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు సీబీఐ తన అభియోగపత్రంలో పేర్కొంది. ఆ తర్వాత ఏప్రిల్ 9న అతడు తీవ్ర గాయాలతో మరణించినట్లు వెల్లడించింది. సీబీఐ వాదనతో ఏకీభవిస్తూనే.. సెంగార్‌కు బాధితురాలి తండ్రి ప్రాణాలు తీసే ఉద్దేశం లేదని తెలిపింది కోర్టు.

ABOUT THE AUTHOR

...view details