కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలను మరింత సడలించింది. మంగళవారం నాటితో అన్‌లాక్-1.0 ముగుస్తోంది. దీనితో జులై 1 నుంచి అన్‌లాక్ 2.0 మొదలుపెడుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో మరిన్ని ఆర్థిక కార్యకలాపాలను దశలవారీగా అనుమతిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సోమవారం రాత్రి జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది. కంటైన్‌మెంట్ జోన్లలో జులై 31 వరకూ లాక్‌డౌన్ కొనసాగుతుందని, నిషేధించిన కొన్ని కార్యకలాపాలు మినహా మిగతావన్నీ వాటి వెలుపల నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. ముందస్తు అనుమతులు, ఈ-పర్మిట్ల అవసరం లేకుండా ప్రయాణికులు, సరుకు రవాణా వాహనాలు దేశంలో ఎక్కడైనా తిరగొచ్చని స్పష్టం చేసింది.
జులై 31 వరకు నిషేధం అమలయ్యేవి ఇవి..
- పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ కేంద్రాలు
- కేంద్ర హోంశాఖ అనుమతించినవి మినహా మిగిలిన అంతర్జాతీయ విమాన ప్రయాణాలు
- మెట్రో రైళ్లు, సినిమా హాళ్లు, వ్యాయామశాలలు, ఈత కొలనులు, వినోద పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాళ్లు
- సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు, భారీ సమావేశాలు
ఏవేవి నడుస్తాయి?
- దేశీయ విమానాలు, రైళ్ల రాకపోకలను ఇప్పటికే పరిమితంగా అనుమతించారు. వాటిని భవిష్యత్తులో క్రమంగా విస్తరిస్తారు.
- ఆన్‌లైన్, దూరవిద్య విధానాలను కొనసాగించుకోవచ్చు.
- జులై 15 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శిక్షణ సంస్థలు తెరుచుకోవచ్చు. వీటి నిర్వహణకు అవసరమైన ప్రామాణిక నిర్వహణ విధానాలను కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ జారీచేస్తుంది.
- కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల ప్రార్థన మందిరాలు, హోటళ్లు, అతిథ్య సేవలు, షాపింగ్ మాళ్లు.