భారత రాజ్యాంగ విశేషాలు ఎన్ని చెప్పుకున్నా తక్కువే. ఒకటా రెండా ఎన్నో ప్రత్యేకమైన విశేషాలతో 70 ఏళ్ల పాటు దేశానికి మార్గదర్శిగా నిలిచింది. ఎన్నో వివాదాస్పద అంశాలకు పరిష్కారం చూపింది. పైకి మనకు తెలుసు అని అనుకునే అంశాల కన్నా మనకు తెలియని విషయాలు ఆసక్తికరంగా అనిపించక మానవు.
రాజ్యాంగ దినోత్సవం..
భారత రాజ్యాంగం అధికారికంగా అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26 అన్న విషయం అందరికి తెలుసు. అందుకే ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవం నిర్వహిస్తారు. అయితే 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చినా.. దాన్ని స్వీకరించింది మాత్రం 1949 నవంబర్ 26న. అందుకే నంవబర్ 26ను కాన్స్టిట్యూషనల్ డే గా పరిగణిస్తారు. 1950 జనవరి 26 ఉదయం 10:18 గంటలకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత గణతంత్ర రాజ్యంగా అవతరించింది భారత్. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సమయంలో దాదాపు 283 రాజ్యాంగసభ సభ్యులు సంతకం చేసారు. ఆ సమయంలోనే వర్షంపడటంతో చాలామంది దాన్ని దేశానికి శుభసూచకంగా భావించారు.
అదే రోజు అంటే 1950 జనవరి 26న గణతంత్ర భారత్‌కు తొలి రాష్ట్రపతిగా డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ నియమితులయ్యారు. అదే సమయంలో స్వతంత్ర భారత్‌కు తొలి న్యాయశాఖ మంత్రిగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వ్యవహరించారు. తొలి గణతంత్ర దినోత్సవానికి ఇండోనేసియా అధ్యక్షుడు సుకర్నో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1955లో జనవరి 26న తొలిసారి గణతంత్ర పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాకిస్థాన్ తొలి గవర్నర్ జనరల్ మాలిక్ గులాం మొహమ్మద్ ముఖ్య అతిథిగా విచ్చేసారు.
సత్యమేవ జయతే..
రాజ్యాంగం, దేశానికి నినాదమైన సత్యమేవజయతేను మండుకోపనిషత్, అధర్వణ వేదం నుంచి స్వీకరించారు. భారత దేశానికి ఈ నినాదం ఉండాలని తొలిసారిగా చెప్పింది పండిట్ మదన్ మోహన్ మాలవీయా.