జమ్ముకశ్మీర్లో కేంద్ర మంత్రుల బృందం త్వరలో పర్యటించనుంది. రాష్ట్ర విభజన, అధికరణ 370 రద్దు ప్రయోజనాలకు అక్కడి ప్రజలకు వివరించేందుకు ఈ పర్యటన చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితిని కూడా అధ్యయనం చేయనున్నట్లు సమాచారం.
ఈ మేరకు కేంద్ర మంత్రుల బృందం జమ్ము కశ్మీర్‌లోని వేర్వేరు జిల్లాల్లో పర్యటించి అక్కడి ప్రజలతో సంభాషించనున్నారు. వారి పర్యటనపై క్షేత్ర స్థాయిలో పరిస్థితుల గురించి అందిన నివేదిక ఆధారంగా త్వరలో జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
అమిత్ షా చొరవతో..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా చొరవతో ఈ పర్యటన చేపట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనను కేంద్ర హోంశాఖ పర్వవేక్షిస్తుందని సమాచారం. జమ్ముకశ్మీర్లో పర్యటించే కేంద్ర మంత్రుల బృందంలో జి. కిషన్ రెడ్డి, రవిశంకర్ ప్రసాద్, స్మృతి ఇరానీ, కిరణ్ రిజుజు, అనురాగ్ ఠాకూర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, రమేష్ పోఖ్రియాల్ ఉండనున్నట్లు సమాచారం.
క్రమంగా ఆంక్షలను సడలిస్తూ..
జమ్ము కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఎటువంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యగా కేంద్రం ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలను దశలవారీగా సవరిస్తూ వస్తోన్న కేంద్రం.. బుధవారం పాక్షికంగా ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించింది.
ఇదీ చూడండి: 'హిజ్బుల్' ఉగ్రమూకపై పోరులో కీలక విజయం