'గదిలో పెట్టి, బెల్టుతో కొట్టడం ఎలాగో బాగా తెలుసు' అంటూ కేంద్ర మంత్రి అధికారులను బెదిరిస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని కరోనా వైరస్ క్వారంటైన్ కేంద్రంలో ఆదివారం ఈ వ్యవహారం చోటుచేసుకుంది. రాయ్‌పూర్‌కు 400 కిలోమీటర్ల దూరంలోని బలరామ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రం వద్ద కేంద్ర గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి రేణుకా సింగ్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు వీడియోలో రికార్డయింది.
గదిలో పెట్టి, బెల్టుతో కొట్టడం ఆ మంత్రికి బాగా తెలుసు! - viral news
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందులో.. 'గదిలో పెట్టి, బెల్టుతో కొట్టడం ఎలాగో బాగా తెలుసు' అంటూ కేంద్ర గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి రేణుకా సింగ్ క్వారంటైన్ కేంద్ర అధికారులను బెదిరిస్తున్నట్లు రికార్డయింది. క్వారంటైన్ కేంద్రంలో వసతుల కొరత ఆరోపణల నేపథ్యంలో మంత్రి ఈ విధంగా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.
'మా ప్రభుత్వం అధికారంలో లేదని ఎవరూ అనుకోవద్దు. 15 సంవత్సరాలు మేం రాష్ట్రాన్ని పాలించాం. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి కేంద్రం వద్ద చాలినంత నిధులున్నాయి. అవసరమైన నిధులు అందజేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నాను. భాజపా కార్యకర్తలు బలహీనంగా ఉన్నారనుకోకండి. గదిలో వేసి తాళం పెట్టి, బెల్టుతో కొట్టడం ఎలాగో నాకు బాగా తెలుసు' అని మంత్రి అధికారులను హెచ్చరిస్తున్నట్లు ఆ వీడియో ద్వారా తెలుస్తోంది. అయితే దానిలో అధికారులు మాత్రం కనిపించడం లేదు.
దిల్లీ నుంచి వచ్చిన దిలీప్ గుప్తా అనే వ్యక్తి క్వారంటైన్ కేంద్రంలోని సౌకర్యాల కొరతను ఎత్తి చూపుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోను పోస్టు చేసినందుకు తహసీల్దారు, ఇతర ఉన్నతాధికారులు తనను వేధించినట్లు అతడు చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో మంత్రి అక్కడ పర్యటించి ఆ వ్యక్తితో మాట్లాడారు.