వర్తమాన రాజకీయాల్లో దళిత దిగ్గజంగా పేరొందిన కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు రాంవిలాస్ పాసవాన్ (74) గురువారం సాయంత్రం దిల్లీలో తుదిశ్వాస విడిచారు. ఇటీవల గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన ఆసుపత్రిలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, లోక్‌సభ సభ్యుడు చిరాగ్ పాసవాన్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. "నాన్నా! మీరు ఈ లోకం విడిచిపెట్టిపోయినా ఎప్పుడూ నాతోనే ఉంటారు" అంటూ విషాద వార్తను వెల్లడించి, చిన్నతనంలో తనను తండ్రి ముద్దాడుతున్న చిత్రాన్ని దానికి జత చేశారు. వర్తమాన రాజకీయాల్లో మాయావతి తర్వాత అత్యంత శక్తిమంతమైన దళిత నాయకుడిగా ఎదిగిన నేత పాసవాన్. బిహార్ రాజకీయాలపై బలమైన ముద్ర వేశారు. అయిదు దశాబ్దాల పాటు భారత రాజకీయాల్లో అలుపెరగని ప్రస్థానం సాగించారు. బిహార్ ఎన్నికల తరుణంలో పాసవాన్ కన్నుమూయడం పార్టీ వర్గాలను శోకసంద్రంలో ముంచింది. ఆయన మృతితో దేశం ఒక గొప్ప దార్శనిక నేతను కోల్పోయిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం వ్యక్తం చేశారు. దివంగత నేత తన తుది శ్వాస వరకు దేశసేవ చేసిన ఉత్తమ నాయకుడని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. 'పాసవాన్ మరణం బాధాకరం. పేదలు, దళితులు ఓ బలమైన గొంతుకను కోల్పోయారు' అంటూ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.
పాసవాన్ మృతికి సంతాప సూచకంగా దిల్లీలోనూ, రాష్ట్రాల రాజధానుల్లోనూ శుక్రవారం జాతీయజెండాను అవనతం చేయనున్నారు. అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కేంద్ర హోంశాఖ తెలిపింది.
అన్నదమ్ములిద్దరూ ఏడాది వ్యవధిలోనే..
గత సార్వత్రిక ఎన్నికల్లో సమస్తీపుర్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన పాసవాన్ సోదరుడు రామచంద్ర పాసవాన్ 2019 జులై 21న అనారోగ్యంతో కన్నుమూశారు. 17వ లోక్‌సభ కాలావధిలోనే అన్నదమ్ములిద్దరూ అనంతలోకాలకు వెళ్లిపోయినట్లయింది. 8 పర్యాయాలు లోక్‌సభ సభ్యుడిగా గెలిచి, ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనంతటి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం వర్తమాన రాజకీయాల్లో ఎవరికీ లేదు. 1946 జులై 5న బిహార్‌లో జన్మించిన ఆయన సంయుక్త సోషలిస్ట్ పార్టీ తరఫున 1969లో తొలిసారి బిహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1974లో లోక్‌దళ్ ఏర్పాటైనప్పుడు అందులో చేరి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అత్యవసర పరిస్థితుల అనంతరం 1977లో జనతా పార్టీలో చేరి బిహార్‌లోని హాజీపుర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత అదే నియోజకవర్గం నుంచి 1980, 89, 96, 98, 99, 2004, 2014 ఎన్నికల్లో విజయదుందుభి మోగించారు. 2009లో మాత్రం ఓడిపోయారు. 2010లో రాజ్యసభకు ఎన్నికై 2014 వరకు కొనసాగారు. 2019లో సీట్ల సర్దుబాటులో భాగంగా లోక్‌సభకు పోటీచేసే అవకాశం రాకపోవడంతో రాజ్యసభకు మరోసారి ఎన్నికయ్యారు.
యూపీయే కూటమిలోనూ మంత్రిగా సేవలు
బిహార్ రాజకీయాల్లో లాలూప్రసాద్, నీతీశ్ కుమార్‌లతో కలిసి జనతా పరివార్‌ను పాసవాన్ నడిపారు. ఆ ఇద్దరు నేతలు రాజకీయ వైరుద్ధ్యాలతో సొంత పార్టీలు పెట్టుకొని వేరుపడటంతో 2000లో ఆయన 'లోక్ జనశక్తి పార్టీ' స్థాపించుకున్నారు. 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే కూటమిలో చేరిన ఆయన అప్పట్లో కేంద్ర ఎరువులు, రసాయనాలు, ఉక్కు శాఖల మంత్రిగా సేవలందించారు. బిహార్‌లోని ఖగాడియా జిల్లా షహర్‌బన్నిలోని జమున్ పాసవాన్, సియాదేవి దంపతులకు జన్మించిన ఆయన 1969లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎదురులేని ప్రయాణాన్ని కొనసాగించారు.