జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)పై అనేక రాష్ట్రాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో ఎన్పీఆర్పై కేంద్రం స్పష్టతనిచ్చింది. ఎన్పీఆర్లో సమాచారాన్ని వెల్లడించే అంశం తప్పనిసరేమీ కాదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పౌరులు స్వచ్ఛందంగానే తమ వివరాలు అందించవచ్చని స్పష్టం చేశారు.
ఎన్పీఆర్ ప్రక్రియను 2010లో కాంగ్రెస్ తొలిసారిగా తీసుకొచ్చిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. జాతీయ జనాభా పట్టికను తిరస్కరించే అధికారం రాష్ట్రాలకు లేదని స్పష్టం చేశారు.
ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి జనగణనతో పాటే జాతీయ జనాభా పట్టిక ప్రక్రియను ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది.