లాక్‌డౌన్ అమల్లో రాష్ట్రాలు ఇష్ట ప్రకారం అనుమతులు ఇవ్వడం మంచిది కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా. ఈనెల 15న జారీచేసిన మార్గదర్శకాలను రాష్ట్రాలు పాటించాల్సిందేనని తేల్చిచెప్పారు.
కేరళ తీరుపై అసహనం!
కేరళ ప్రభుత్వం రెస్టారెంట్లు, పుస్తకాల దుకాణాలు తెరిచేందుకు అంగీకరించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది కేంద్ర హోంశాఖ. బస్సులు, ద్విచక్రవాహనాల అనుమతిపైనా అసంతృప్తి వెలిబుచ్చింది. ఇది లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించడమేనని తేల్చిచెప్పింది. అత్యవసరం కాని సేవలు, కార్యకలాపాలకు పలు రాష్ట్రాలు అనుమతిస్తున్నట్లు సమాచారం వచ్చిందని... తక్షణమే వాటిని నిలిపివేసి కేంద్రం ఆదేశాలను తప్పక పాటించాలని స్పష్టం చేసింది.