తెలంగాణ

telangana

'దేశంలో కరోనా మరణాల రేటు 3.3శాతం'

By

Published : Apr 18, 2020, 4:39 PM IST

Updated : Apr 18, 2020, 5:13 PM IST

కరోనా బాధితుల్లో 3.3శాతం మంది మరణిస్తున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మృతుల్లో 42.2శాతంపైగా 75ఏళ్లు పైబడిన వారేనని పేర్కొంది. అయితే దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 29.8శాతం కేసులు తబ్లీగి జమాత్​ మర్కజ్​కు సంబంధించినవని స్పష్టం చేసింది.

UNION HEALTH MINISTRY BRIEFING ON CORONA VIRUS OUTBREAK
కరోనా బాధితుల్లో మరణాలు 3.3శాతమే: కేంద్ర ఆరోగ్యశాఖ

దేశవ్యాప్తంగా కరోనా బాధితుల్లో మరణాలు 3.3 శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్​ అగర్వాల్​ వెల్లడించారు. మృతుల్లోని 14.4శాతం.. 45 ఏళ్లలోపు వారని తెలిపారు. 45-60ఏళ్ల మధ్యలో మరణాల రేటు 10.3శాతంగా ఉందన్నారు. 60-75ఏళ్ల వారు 33.1శాతం మంది, 75 ఏళ్లు పైబడిన వారిలో 42.2శాతానికైపా ప్రాణాలు కోల్పోయారని వివరించారు.

తబ్లీగి జమాత్​ వల్ల...

దేశవ్యాప్తంగా నమోదైన 14,378 కేసుల్లో 29.8శాతం కేసులు దిల్లీ నిజాముద్దీన్​ తబ్లీగి జమాత్​ మర్కజ్​తో సంబంధం ఉన్నవేనని పేర్కొన్నారు లవ్​ అగర్వాల్​. అత్యధికంగా తమిళనాడులో 43శాతం కేసులు మర్కజ్​ వల్లే నమోదైనట్టు తెలిపారు.

ఆ జిల్లాల్లో ఒక్క కేసు కూడా...

దేశవ్యాప్తంగా 45 జిల్లాల్లో 2 వారాలుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని పేర్కొన్నారు లవ్​ అగర్వాల్​. కర్ణాటకలోని కొడుగు, పుదుచ్చేరిలోని మాహెలో గత 28రోజుల్లో పాజిటివ్​ కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు. 23 రాష్ట్రాల్లోని 47 జిల్లాల్లో సానుకూల పరిస్థితులు కనపడుతున్నట్టు తెలిపారు లవ్​ అగర్వాల్​.

నిరంతర పర్యవేక్షణ...

భౌతిక దూరం అమలు విషయంలో రాష్ట్రాలు ఎక్కువ బాధ్యత వహించాలని సూచించారు లవ్​ అగర్వాల్​. హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లోని వారికి రాపిడ్‌ యాంటీబాడీ టెస్టులు అధిక సంఖ్యలో చేయాలన్నారు. కంటైన్‌మెంట్‌ జోన్ల ఏర్పాటు వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్న కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి... రెడ్‌జోన్‌, క్వారంటైన్‌ ప్రాంతాలను డ్రోన్‌ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించాలని నిర్దేశించారు. అవసరమైతే ఎన్‌-95 మాస్కులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటామని స్పష్టం చేశారు. కరోనా పరీక్షల కోసం ఎక్కువ ల్యాబ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు లవ్ అగర్వాల్.

దేశంలో కేసులు, మరణాల సంఖ్య ఇలా

ఇదీ చూడండి:-కరోనా సోకి పోలీస్​ ఉన్నతాధికారి మృతి

Last Updated : Apr 18, 2020, 5:13 PM IST

ABOUT THE AUTHOR

...view details