కరోనాపై పోరులో భారత్కు సోమవారం ఎంతో ముఖ్యమైన రోజుగా అభివర్ణించింది కేంద్రం. కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సోమవారం నుంచి ప్రత్యేక కార్యకలాపాలు ప్రారంభమవుతాయని పునరుద్ఘాటించింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిబంధనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.
హాట్స్పాట్లు, కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఎలాంటి సడలింపులు ఉండవని వెల్లడించింది కేంద్రం. సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లు, ప్రార్థనా మందిరాలు మే 3వరకు తెరుచుకోవని పేర్కొంది.
వ్యాక్సిన్ తయారీ...
వ్యాక్సిన్ అభివృద్ధి కోసం చర్యలు ముమ్మరం చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. ఈ మేరకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయన్నారు.