మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీతో.. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సమావేశమవడం తీవ్ర వివాదాలకు దారితీస్తోంది. ముఖ్యంగా ఈ విషయంపై శివసేన తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ముంబయిని పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోలుస్తూ వ్యాఖ్యలు చేసిన కంగనాకు భాజపా మద్దతునివ్వడం చాలా దురదృష్టకరమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. దీన్ని ఆసరాగా చేసుకొని బిహార్ ఎన్నికల్లో భాజపా విజయం సాధించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
ముంబయి నగర ప్రాముఖ్యతను తగ్గించేందుకు కుట్ర జరుగుతోందని శివసేన అధికారిక పత్రిక 'సామ్నా'లో సంజయ్ రౌత్ పేర్కొన్నారు. మరాఠా ప్రజలకు ఇది గడ్డుకాలం లాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. 'ఒక నటి ముఖ్యమంత్రిని అవమానిస్తున్నా.. ప్రజలు స్పందించకూడదా? ఇదేం ఏక పక్ష స్వేచ్ఛ?' అంటూ రౌత్ విరుచుకుపడ్డారు.