కేరళకు చెందిన ఓ డ్యాన్సర్ ఆత్మస్థైర్యానికి ప్రతీకగా నిలుస్తున్నాడు. ఆరు నెలల క్రితం యాక్సిడెంట్ లో కాలు పొగొట్టుకుని... ప్రతిభతో య్యూట్యూబ్ లో వేలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.
స్టెప్పులేసే కాలు లేకపోతేనేం.. ఖలేజా ఉంది! వాయనాడ్, పులిర్మలకు చెందిన స్వరూప్ జనార్థనన్(29)కు సినిమాల్లో డ్యాన్స్ చేయాలని, మోడలింగ్ రంగంలో సత్తా చాటాలని ఎన్నెన్నో కలలు కనేవాడు. కానీ, ఫిబ్రవరిలో స్వరూప్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఓ కారు వచ్చి తన బైకును ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు స్వరూప్. దాదాపు 3 నెలల పాటు మంచంపైనే చికిత్స పొందాడు.
కలలు కూలిన క్షణం...
స్వరూప్ ప్రాణం నిలవాలంటే ఓ కాలు తీసేయాలన్నారు డాక్టర్లు. ఆ క్షణాన స్వరూప్ కన్న కలలన్నీ ఒక్కసారిగా కుప్పగా రాలిపడ్డాయి. గుండెలవిసేలా ఏడ్చాడు స్వరూప్. కానీ, వాస్తవాన్ని అంగీకరించాడు. ఒంటికాలుతో ఇంటికి చేరాడు. కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రోత్సాహంతో మళ్లీ డ్యాన్స్ మొదలెట్టాడు. కాళ్లతో కాదు మనసుతో చిందులేశాడు. అలా తన స్నేహితులతో కలిసి చేసిన ఓ డ్యాన్స్ య్యూట్యూబ్ లో వేలాది మంది అభిమానులను తెచ్చిపెట్టింది.
అభిమానులకు మరిన్ని డ్యాన్స్ వీడియోలు అందించాలనేదే ఇప్పుడు స్వరూప్ సంకల్పం. ఒంటికాలితో ఇంత చేయగలుగుతున్న తాను కృత్రిమ కాలుంటే అంతకు మించి సత్తా చాటగలనంటున్నాడు. అయితే, కృత్రిమ కాలి కోసం సుమారు రూ. 24 లక్షలు కావాలి. తన ప్రతిభను గుర్తించి ఎవరైనా సాయం చేస్తే స్టెప్పులు ఇరగదీస్తానంటున్నాడు.
ఇదీ చదవండి: సరికొత్తగా సంగీతం.. జల తరంగాలే వాయిద్యాలు