చాబహర్ పోర్టు... ఇరాన్లో భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వ్యూహాత్మక ప్రాజెక్ట్. ఈ పోర్టులో కార్యకలాపాల ద్వారా మధ్య ఆసియాలో తన ప్రాముఖ్యాన్ని పెంచుకోవాలని భావించింది భారత్. ప్రాజెక్ట్ రెండో దశలో భాగంగా.. 628 కిలోమీటర్ల రైల్వే లైన్‌ను నిర్మించడానికి అంగీకరించింది. ఇది ఇరాన్ పోర్టు పట్టణం చాబహర్‌ను.. అఫ్గానిస్థాన్ సరిహద్దు ప్రాంతం జెహదన్ను కలుపుతుంది.
అయితే ఇరాన్‌పై అమెరికా ఆంక్షల కొరడా ఝుళిపించిన తరుణంలో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం ఆలస్యమైంది. పనులు మొదలుపెట్టాలని ఇరాన్ అభ్యర్థించినా.. అమెరికా ఆంక్షల నేపథ్యంలో భారత్ ముందడుగు వేయలేదు. ఇదంతా పాత కథే. అయితే ఇటీవలే ఇరాన్ అనూహ్యంగా ఓ ప్రకటన చేసింది. రైల్వే లైన్‌ను తామే నిర్మించుకుంటామని వెల్లడించింది. గత మంగళవారం ఇందుకు సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టేసింది.
ఇరాన్ అనూహ్యంగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? అసలు ఈ రైల్వే ప్రాజెక్ట్ వ్యవహారం ఇప్పుడు తెరపైకి ఎందుకు వచ్చింది? ఇంత భారీ ప్రాజెక్ట్‌ను ఇరాన్ స్వయంగా నిర్మించుకోగలదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్‌తో చైనా చేసుకోబోతున్న ఓ "రహస్య" ఒప్పందం.. వీటన్నిటికీ సమాధానంగా కనపడుతోంది.
ఇరాన్-చైనా ఒప్పందం...
ఒప్పందంపై ఇరాన్-చైనా ఇప్పటివరకు బహిరంగ ప్రకటనలు చేయలేదు. అయితే ఇది దాదాపు ఖరారు అయిపోయినట్టు తెలుస్తోంది. ఇరాన్లో చైనా భారీ పెట్టుబడులు పెట్టడం.. బదులుగా అతి తక్కువ ధరలకు ఆ దేశ చమురు విక్రయించడం, మిలిటరీ సామగ్రి సహా ఇతర రంగాల్లో 25ఏళ్ల పాటు సహకారం పొందడం ఈ ఒప్పందంలో భాగం.
ఈ విషయాన్ని ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ సలహాదారు అలీ అకా-మొహమ్మది ప్రస్తావించారు. అమెరికాపై పరోక్షంగా నిందారోపణలు చేశారు.
"దీనితో(ఒప్పందంతో) ఆర్థిక, రక్షణ సహకారంలో ఇరు దేశాల బంధం మరింత బలపడుతుంది. మూడో వ్యక్తి(అమెరికా) జోక్యం చేసుకోకుండా రక్షణ కల్పిస్తుంది. ఆంక్షలతో ఇరాన్-చైనా దెబ్బతీద్దాము అని అనుకున్న అమెరికా ప్రణాళికలు చిన్నాభిన్నమవుతాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ద్వారా డాలరుకు భారీ నష్టం జరుగుతుంది."
-- అలీ అఖా-మొహమ్మది, ఇరాన్ సుప్రీం నేత సలహాదారు.
చైనాకు లాభమేంటి?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చైనాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారత్ సరిహద్దు వివాదం సహా అనేక విషయాల్లో చైనా తీరుపై ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. చైనాను ఏకాకిని చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.
మరోవైపు భారత్-అమెరికా మధ్య సంబంధాలు రోజురోజుకు బలపడుతున్నాయి. ఇదే సమయంలో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు కలిసి 'క్వాడ్' ఏర్పాటు చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ చైనాకు ప్రతికూల అంశాలే.