తెలంగాణ

telangana

ప్రభుత్వ నిర్ణయం చారిత్రకం.. కాదు కాంగ్రెస్​ విజయం!

By

Published : Nov 5, 2019, 5:02 AM IST

Updated : Nov 5, 2019, 7:26 AM IST

ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (ఆర్​సెప్​)లో చేరకూడదన్న ప్రభుత్వ నిర్ణయం చారిత్రకమని కొనియాడింది భాజపా. ప్రధాని మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రసంశలు కురిపించింది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్ష కాంగ్రెస్​ సొంత విజయంగా అభివర్ణించుకుంది. తమ నుంచి ఎదురైన బలమైన వ్యతిరేకత వల్లే భాజపా ప్రభుత్వం వెనకడుగు వేసిందని తెలిపింది.

ఆర్​సెప్​: ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మకం.. కాదు కాంగ్రెస్​ విజయం!

ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై స్పందన

ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంలో చేరటం లేదని భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది భాజపా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం చారిత్రకమని కొనియాడింది. బలమైన నాయకత్వం కలిగిన మోదీ నేతృత్వంలో దేశం పురోగమిస్తుందని పేర్కొంది.

భారత్​ తలవంచదు..

ఆర్​సెప్​లో చేరాలని ప్రపంచ శక్తులు చేసే ఒత్తిడికి ప్రధాని మోదీ నాయకత్వంలోని భారత్​ తలవంచదని పేర్కొన్నారు భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా. ఆర్థిక ప్రయోజనాలను పక్కనపెట్టి.. గత ప్రభుత్వాల మాదిరిగా బలహీన ఒప్పందాలు చేసుకుని భారత విపణి తలుపులు బార్లా తెరవబోమని స్పష్టం చేశారు. మోదీ నేతృత్వంలోని భారత విదేశాంగ విధానంలో దేశమే తొలి ప్రాధాన్యం అనేది ప్రతిబింబిస్తుందని కొనియాడారు.

బలమైన నాయకత్వం..

ఆర్​సెప్​ ఒప్పందంపై సంతకం చేయకపోవటం ప్రధాని మోదీ బలమైన నాయకత్వాన్ని సూచిస్తోందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. జాతీయ ప్రయోజనాలను కాపాడే దిశగా అడుగులు వేశారని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం దేశంలోని రైతులు, చిన్న తరహా, పాడి, తయారీ రంగంతో పాటు వివిధ రంగాలకు లబ్ధి చేకూర్చుతుందన్నారు.

జాతీయ ప్రయోజనాలకు విరుద్ధం..

ఆర్​సెప్​ ఒప్పందం అనేది భారత ఆర్థిక, జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్​ గోయల్​. రైతులు, పాడి, చిన్న, మధ్యతరహా, దేశీయ తయారీ రంగాలపై పడే ప్రభావంపై ప్రధాని ఆందోళన చెందారని తెలిపారు. ఆర్​సెప్​లో చేరకూడదని ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.

చారిత్రక నిర్ణయం..

ఆర్​సెప్​లో చేరకూడదని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రక పేర్కొంది రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​ అనుబంధ సంస్థ స్వదేశీ జాగ్రన్​ మంచ్​ (ఎస్​జేఎం). మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. దేశంలోని చిరు వ్యాపారులు, రైతులు, పాడి, తయారీ రంగానికి మేలు చేకూరుతుందని పేర్కొంది.

కాంగ్రెస్​ విజయం..

ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంలో చేరకూడదన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్ష కాంగ్రెస్​ సొంత విజయంగా అభివర్ణించుకుంది. వ్యవసాయ, చిన్న తరహా వ్యాపారవేత్తల ప్రయోజనాలు దెబ్బతినకుండా.. తమ నుంచి ఎదురైన బలమైన వ్యతిరేకత వల్లే.. భాజపా ప్రభుత్వం వెనకడుగు వేసిందని తెలిపింది. ఈ గెలుపు జాతీయ ప్రయోజనాల కోసం పోరాడిన వారందరిదని కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సింగ్​ సుర్జేవాలా అన్నారు. ఏదో సాధించామని భాజపా సహా అమిత్​ షా చెబుతున్నారని, అయితే.. ప్రభుత్వ మెడలు వంచింది కాంగ్రెస్సేనని వారు గుర్తు చేసుకోవాలన్నారు.

ఇదీ చూడండి: దేశ​ ప్రయోజనాలకే పెద్దపీట.. ఆర్​సెప్​కు భారత్​ నో

Last Updated : Nov 5, 2019, 7:26 AM IST

ABOUT THE AUTHOR

...view details