తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"నా ఉద్దేశం అది కాదు" - యడ్యూరప్ప

తన వ్యాఖ్యలపై విమర్శల దాడి పెరిగిన నేపథ్యంలో కర్ణాటక భాజపా అధ్యక్షుడు యడ్యూరప్ప వెనక్కి తగ్గారు. ఉగ్రశిబిరాలపై వైమానిక దాడుల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందే ప్రశ్నే లేదన్నారు.

"నా ఉద్దేశం అది కాదు": యడ్యూరప్ప

By

Published : Feb 28, 2019, 8:01 PM IST

భారత్​ చేపట్టిన మెరుపుదాడుల వల్ల కర్ణాటకలో భాజపా 22 లోక్​సభ సీట్లు గెలుస్తుందని చేసిన వ్యాఖ్యలను కర్ణాటక భాజపా నేత యడ్యూరప్ప వెనక్కి తీసుకున్నారు. ఉగ్ర శిబిరాలపై మెరుపుదాడులు చేయడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందే ప్రశ్నేలేదన్నారు. దేశమే తనకు మొదటి ప్రాధాన్యమని స్పష్టం చేశారు.

ఉగ్రశిబిరాలపై భారత్​ వైమానిక దాడులు చేసిన నేపథ్యంలో కర్ణాటకలోని 28 స్థానాల్లో భాజపా 22 చోట్ల విజయం సాధిస్తుందని యడ్యూరప్ప వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

సొంతపార్టీ నుంచే విమర్శలు

యడ్యూరప్ప వ్యాఖ్యలపై భాజపా నేతల నుంచీ విమర్శలు ఎదురయ్యాయి. భాజపా నేత, మాజీ సైన్యాధిపతి వీకే సింగ్​ ట్విట్టర్ వేదికగా ఈ అంశంపై ఘాటుగా స్పందించారు.

"యడ్యూరప్పా జీ! మీ అభిప్రాయాలతో నేను విభేదిస్తున్నాను. మేము దేశం కోసం పాటుపడుతున్నాం. దేశ భద్రత, పౌరుల రక్షణ కోసం కృషి చేస్తున్నాం. కేవలం కొన్ని లోక్​సభ స్థానాల్లో గెలుపుకోసం కాదు."
-ట్వీట్​లో వీకే సింగ్​, విదేశాంగశాఖ సహాయమంత్రి, మాజీ భారత సైన్యాధిపతి

సిగ్గుచేటు...

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య... యడ్యూరప్ప వ్యాఖ్యలపై మండిపడ్డారు. సైనికుల త్యాగంతో భాజపా రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. దేశ భద్రత కంటే భాజపాకు ఎన్నికల్లో విజయమే ముఖ్యమైందని తూర్పారబట్టారు. యడ్యూరప్ప వ్యాఖ్యలు సిగ్గు చేటని కుమారస్వామి అన్నారు.

పాక్​ మీడియా విసుర్లు

యడ్యూరప్ప వ్యాఖ్యలతో పాకిస్థాన్ మీడియా, అధికార పీటీఐ పార్టీలు భారత్​పై ఘాటుగా స్పందించాయి. భారత్​ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే దాడులకు పాల్పడుతోందని విమర్శించాయి. కేవలం కొన్ని లోక్​సభ స్థానాల్లోగెలుపొందడానికి యుద్ధాన్ని సృష్టించబోతున్నారని దుయ్యబట్టాయి.

తప్పుగా అర్థం చేసుకున్నారు...

విమర్శల దాడి పెరిగిన నేపథ్యంలో యడ్యూరప్ప స్పందించారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. పరిస్థితులు భాజపాకు అనుకూలంగా ఉన్నాయంటూ గత కొన్ని రోజులుగా చెబుతున్న మాటలనే మళ్లీ చెప్పానన్నారు. వరుస ట్వీట్లు చేస్తూ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.

"దేశ భద్రత కోసం పోరాడుతున్న సైన్యం అంటే నాకు ఎంతో గౌరవం ఉంది, వారికి వందనం చేస్తున్నాను."

_ యడ్యూరప్ప, కర్ణాటక భాజపా నేత

ABOUT THE AUTHOR

...view details