సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడానికి చైనా నిజంగానే ప్రయత్నిస్తోందా? లేదంటే భారత్‌ను దెబ్బతీయడానికి సమయం కోసం ఎదురుచూస్తోందా? చైనాతో జాగ్రత్తగా ఉండాలన్న నిపుణుల మాటలు నిజంకానున్నాయా? వివాదాన్ని పరిష్కరించేందుకు తలపెట్టిన చర్చలను తాజాగా చైనా అడ్డుకోవడం ఈ ప్రశ్నలకు మరింత బలం చేకూరుస్తోంది.
చర్చలపై అనిశ్చితి...
తూర్పు లద్ధాఖ్లోని సరిహద్దులో బలగాలను ఉపసంహరించుకుని, ఉద్రిక్తతలను తగ్గించేందుకు గురువారం కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలకు భారత్ ప్రతిపాదించినట్టు సమాచారం. పాంగ్యాంగ్ సరస్సులో నెలకొన్న ప్రతిష్టంభనపై ఈ భేటీలో చర్చలు జరపాలని భావించింది భారత్. అయితే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) ఇందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. చర్చల కోసం పీఎల్ఏ వేరే తేదీని కూడా చెప్పలేదని సైనికవర్గాలు అంటున్నాయి.
వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న భూభాగం చైనాకు అనుకూలంగా ఉంది. మౌలిక వసతులు, లాజిస్టిక్స్, తూర్పు లద్దాఖ్‌లో బీభత్సం సృష్టించే శీతాకాలాన్ని ఎదుర్కొనే పరికరాల పరంగా చైనా ఎంతో మెరుగైన స్థానంలో ఉంది.
ఇప్పటికే కరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థ డీలా పడింది. చైనాతో వివాదం నేపథ్యంలో సరిహద్దులో భారీ స్థాయిలో బలగాలను మోహరించిన భారత్‌కు.. సైనికుల వసతి, పరికరాల నిర్వహణలో ఆర్థిక భారం ఎదుర్కొనే అవకాశముంది.
ప్రస్తుతం తూర్పు లద్ధాఖ్‌లో నాలుగు కీలక ప్రాంతాలున్నాయి. అవి గల్వాన్ లోయ(పెట్రోలింగ్ పాయింట్ 14), పాంగ్యాంగ్ సరస్సు(ఫింగర్ 4), హాట్ స్ప్రింగ్(పెట్రోలింగ్ పాయింట్ 15), గాగ్రా(పెట్రోలింగ్ పాయింట్17).