పౌరసత్వ చట్ట సవరణ (సీఏఏ) అంశంలో జోక్యాన్ని కోరుతూ ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. సీఏఏ భారత అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన అంశమని పేర్కొంటూ వారికి దీటుగా సమాధానం ఇచ్చింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్‌కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
చట్టాలు చేయడం భారత సార్వభౌమ హక్కుగా రవీశ్‌కుమార్ అభివర్ణించారు. ఈ విషయాల్లో ఏ విదేశానికి జోక్యం చేసుకునే హక్కు లేదని గట్టిగా నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. సీఏఏ రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉందనే విషయంలో భారత్ స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. భారత స్వతంత్ర న్యాయవ్యవస్థపై అందరికీ పూర్తి గౌరవం, నమ్మకం ఉందని.. తమ గొంతును, చట్టబద్దమైన స్థానాన్ని సుప్రీంకోర్టు నిరూపిస్తుందని విశ్వసిస్తున్నామని తెలిపారు.