అంతర్జాతీయ ఉగ్రవాదానికి పాకిస్థాన్ కేంద్రబిందువైందని తమ దేశం చాలాకాలంగా చెబుతూనే ఉందని, ఇప్పుడు ఐక్యరాజ్య సమితి నివేదికతో ఆ విషయం రుజువైందని భారత విదేశీ వ్వవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అఫ్గానిస్థాన్‌లో 6,500 మంది పాకిస్థాన్ ఉగ్రవాదులు యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, పాక్ ప్రభుత్వం మద్దతు తోనే ఇది జరుగుతోందని పేర్కొంది.
'అఫ్గానిస్థాన్ కేంద్రంగా పాక్ ఉగ్ర కార్యకలాపాలు' - Pakistani terrorists operate in Afghanistan
అఫ్గానిస్థాన్ కేంద్రంగా పాకిస్థాన్ ఉగ్ర కార్యకలాపాలను యథేచ్ఛగా నిర్వహిస్తోందని ఐక్యరాజ్యసమితి నివేదికలో తేలినట్లు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. తీవ్రవాదానికి పాకిస్థాన్ కేంద్రబిందువైందని భారత్ చాలా కాలంగా చెబుతోందని, ఈ నివేదికతో ఇప్పుడు మళ్లీ రుజువైందని పేర్కొంది.
ప్రపంచ శాంతికి ముప్పు, అఫ్గానిస్థాన్ భద్రత, స్థిరత్వానికి సంబంధించిన అంశాలపై ఐరాస భద్రతా మండలి నివేదిక రూపొందించింది. నిషిద్ధ అల్‌ఖైదా, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలు అఫ్గానిస్థాన్‌లో యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు ఆ నివేదిక తేల్చిందని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. విదేశీ ఉగ్రవాదులు సహా, పాకిస్థాన్‌కు చెందిన 6,500 మంది ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పాక్ అండతోనే ఇక్కడ ఉగ్రవాదలకు శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు.
ఉగ్రకార్యకలాపాలను పూర్తిగా నిషేధిస్తామని అంతర్జాతీయ సమాజానికి ఇచ్చిన హామీని పాకిస్థాన్ విస్మరించిందని శ్రీవాస్తవ అన్నారు. ఐరాస భద్రతా మండలి, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ తీర్మానాలను అమలు చేయడంలో పాక్ పూర్తిగా విఫలమైందని తెలిపారు.