తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఇమ్రాన్ వ్యాఖ్యలే ఐరాస నివేదికలో ప్రస్ఫుటించాయి'

అఫ్గానిస్థాన్‌లోకి వేలాది మంది తీవ్రవాదులు పాక్‌ నుంచి వెళుతున్నారని ఐక్యరాజ్యసమితి రూపొందించిన నివేదిక... ఇమ్రాన్ ఖాన్ గతంలో చేసిన బహిరంగ వ్యాఖ్యలకు నిదర్శనమని భారత్ పేర్కొంది. తమ దేశంలో 30 నుంచి 40 వేల మంది ఉగ్రవాదులు ఆశ్రయం పొందుతున్నారని ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసింది.

india pak un
భారత్ పాక్

By

Published : Jun 6, 2020, 5:31 AM IST

పాకిస్థాన్​లోని ఉగ్రవాద సంస్థలపై ఇటీవల ఐక్యరాజ్య సమితి(ఐరాస) విడుదల చేసిన నివేదికపై భారత్ స్పందించింది. అఫ్గానిస్థాన్‌లోకి వేలాది తీవ్రవాదులు పాక్‌ నుంచి వెళుతున్నారని ఐరాస రూపొందించిన నివేదిక.. పాక్‌ ప్రధాని గతంలో చేసిన బహిరంగ వ్యాఖ్యలకు నిదర్శనమని భారత్ పేర్కొంది.

గతేడాది జూలైలో అమెరికా పర్యటించిన పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌, తమ దేశంలో 30 నుంచి 40 వేలమంది ఉగ్రవాదులు ఆశ్రయం పొందుతున్నారని చేసిన వ్యాఖ్యలను భారత్ గుర్తుచేసింది.

ఈ అంశంపై మాట్లాడిన విదేశాంగ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ.. భారత్‌-అఫ్గానిస్థాన్‌ల మధ్య స్నేహాపూర్వక వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నది ఎవరన్న విషయం... అఫ్గాన్ సహా అంతర్జాతీయ సమాజానికీ తెలుసునని వ్యాఖ్యానించారు.

"గతంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్న మాటలే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నివేదికలో ప్రస్ఫుంటించాయి. పాకిస్థాన్‌ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని ఐరాస నివేదికతో మరోసారి రుజువైంది."

-అనురాగ్ శ్రీవాస్తవ, విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి

ఐక్యరాజ్య సమితి గుర్తించిన ముష్కరులు, ఉగ్రసంస్థలు చాలా వరకు పాకిస్థాన్​లో ఉన్నాయని శ్రీవాస్తవ గుర్తు చేశారు. ఐరాస నివేదికపై బురదజల్లే ముందు.. పాకిస్థాన్ తనను తాను ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. తన నియంత్రణలో ఉన్న భూభాగంలోని ఉగ్రవాదులకు మద్దతు ఉపసంహరించుకోవాలని సూచించారు.

నివేదికలో ఏముందంటే?

పాక్ సహా విదేశాలకు చెందిన 6,500 మంది తీవ్రవాదులు అఫ్గానిస్థాన్‌లో విధ్వంసం సృష్టిస్తున్నారని ఐరాస నివేదిక వెల‌్లడించింది. పాకిస్థాన్‌కు చెందిన జైష్-ఎ-మహ్మద్‌, లష్కర్‌-ఎ-తొయిబా వంటి సంస్థలు.. తీవ్రవాదులను అఫ్గానిస్థాన్‌లోకి పంపిస్తున్నాయని నివేదిక తేల్చిచెప్పింది.

ABOUT THE AUTHOR

...view details