మసూద్ అజార్‌ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 'అంతర్జాతీయ తీవ్రవాది'గా గుర్తించటం సంతోషించదగిన విషయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని రూపుమాపటంలో భారత్‌కు ఇది భారీ దౌత్య విజయమని కొనియాడారు. ప్రపంచ వేదికపై భారత్ ప్రయత్నాలు ఫలించాయని రాజస్థాన్ జయపురలో నిర్వహించిన ఎన్నికల ప్రసంగంలో తెలిపారు ప్రధాని.
గత ప్రభుత్వ హయాంలో కనీసం ప్రధాని గొంతు వినబడని పరిస్థితులు ఉన్నాయని కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు 130 కోట్ల మంది ప్రజల గొంతుక ఐరాస వేదికపై వినిపించిందన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని మున్ముందు మరిన్ని జరుగుతాయని చెప్పారు.
" ఐక్యరాజ్య సమితి మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించటం సంతోషించదగిన విషయం. ఆలస్యమైనా మంచే జరిగింది. తీవ్రవాదంపై పోరులో, ఉగ్రవాదాన్ని రూపుమాపటంలో చాలా కాలం నుంచి భారత్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇది దేశానికి అతిపెద్ద దౌత్య విజయం."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తోన్న పోరాటానికి మద్దతుగా నిలిచిన దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని.