దిల్లీ వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ఎంతో చర్చనీయాంశమైంది. దేశ రాజధానిలో ప్రజలు పడుతున్న ఇక్కట్లపై సర్వత్రా ఆందోళన నెలకొంది. వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీ కాలుష్య భూతంతో పోరాడటానికి భారత్-బ్రిటన్కు చెందిన శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు ఉమ్మడిపోరుకు సిద్ధమవుతున్నారు.
మాంచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన వాయు నిపుణులు.. ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్(ఐఎమ్ఈసీ), ఇండియన్ ఇన్స్టిట్యూన్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ(ఐఐటీఎమ్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్(ఐఐటీ-ఎమ్) సభ్యులతో కలిసి దిల్లీ పరిస్థితులపై పరిశోధన నిర్వహిస్తున్నారు. వాయు కాలుష్యానికి గల ముఖ్య కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అనంతరం కాలుష్య ప్రభావం, నియంత్రణపై పరిశోధనలు చేయనున్నారు.
"దిల్లీ వాయు కాలుష్యానికి.. భారీ ట్రాఫిక్, వ్యర్థాలను తగలపెట్టడంతో పాటు అనేక కారణాలున్నాయి. పంటలను తగలపెట్టడమూ ఓ ముఖ్య కారణం. మేము చేస్తున్న పరిశోధన తొలి దశలోనే ఉన్నప్పటికీ ఇప్పటికే ఎంతో ఉపయోగపడుతోంది. నగరవ్యాప్తంగా వ్యాపించి ఉన్న ధూళి పదార్థాల నమూనాలను సేకరించాం. వాయు కాలుష్యానికి తోడ్పడుతున్న వివిధ పదార్థాలు ఇంచుమించు ఒకటే రకంగా ఉన్నాయి."
- హ్యూగ్ కోయి, మాంచెస్టర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్.