ఎప్పుడూ పక్కవారితో పోల్చుకుంటూ.. వారి కంటే ఇందులో తక్కువ, అందులో ఎక్కువ అనుకునేవారు తమలోని ప్రతిభను ఎన్నటికీ బయటపెట్టలేరని గట్టిగా నమ్మింది లలిత. ఎదుటివారికన్నా తాను ఎందులోనూ తక్కువ కానని నిరూపించింది. దివ్యాంగురాలైతేనేం... మనసు నిండా ఏదో సాధించాలన్న తపన ఉంది. దేవుడిచ్చిన కళ తన చేతుల్లో ఉంది. అందుకే, 150కి పైగా గృహోపకరణాలు తయారు చేసింది.
కళ ఉంటే చాలు..
కర్ణాటక కుందాపుర తాలూకా కొరవడికి చెందిన లలిత పూజారి బాల్యం అందరిలాగానే సాఫీగా సాగింది. అయితే, ఆరేళ్ల వయసులో ఆమెకు పోలీయో వ్యాధి సోకింది. ఆమె కాళ్లు, చేతులు బలహీనమైపోయాయి. కానీ అంగ వైకల్యం ఆమె ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం తగ్గించలేదు.
తనను చూసి కొందరు జాలి పడ్డారు, మరికొందరు చిన్నచూపు చూశారు అవేవీ ఆమె పట్టించుకోలేదు. తనకున్న ప్రతిభతో ఏం చేయగలదో ఆలోచించింది. ఇంట్లో కూర్చుని యూట్యూబ్లో గృహాలంకరణ తయారీ వీడియోలు చూసి, అవి తానూ చేయాలని నిశ్చయించుకుంది.