మహారాష్ట్రకు 18వ ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా నేడు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే బాధ్యతలు స్వీకరించనున్నారు. ఠాక్రే కుటుంబం నుంచి మొదటిసారి సీఎం పదవిని అధిరోహించనున్నారు ఉద్ధవ్.
సేన నుంచి సీఎం పదవిని పొందినవారిలో మూడో నేతగా నిలిచారు ఉద్ధవ్. ఆయనకన్నా ముందు సేన నుంచి మనోహర్ జోషి, నారాయణ్ రాణే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేశారు.
నెల రోజుల తర్వాత...
మహారాష్ట్ర శాసనసభ ఫలితాలు విడుదలైన దాదాపు నెల తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు ఠాక్రే. మహా రాజకీయాల్లో ఎన్నో మలుపుల అనంతరం సీఎం పీఠం ఠాక్రేకు దక్కింది.
మహా పరిణామాలు..
భాజపాతో 'చెరిసగం పదవి' విషయంలో సయోధ్య కుదరని నేపథ్యంలో ఆ పార్టీతో శివసేన తెగదింపులు చేసుకుంది. సరైన సంఖ్యాబలం లేని కారణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని భాజపా ప్రకటించింది. ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్, ఎన్సీపీతో జతకట్టింది శివసేన.
మధ్యలో ఎన్సీపీని అజిత్ పవార్ సహకారంతో చీల్చి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణ స్వీకారం చేసినా.. అది మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. అజిత్ పవార్ వెనక్కి తగ్గిన నేపథ్యంలో నాలుగు రోజులకే ఫడణవీస్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
అనంతరం కాంగ్రెస్-శివసేన-ఎన్సీపీ పార్టీలు మహా వికాస్ అఘాడీగా ఏర్పడి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్ధవ్ ఠాక్రేను ఎంచుకున్నారు.
ఇదీ చూడండి: ఉద్ధవ్ ప్రమాణ స్వీకారంపై బొంబాయి హైకోర్టు 'ఆందోళన'