మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కోసం భాజపాకు మిత్రపక్షం శివసేన మద్దతు అనివార్యమైంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవిపై శివసేన కన్నేసింది. ఐదేళ్ల కాలాన్ని చెరిసగం పంచుకోవాలని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రతిపాదించారు.
50-50 సీఎం
శాసనసభ ఫలితాలకు సంబంధించి స్పష్టత వచ్చాక భాజపా, శివసేన వేర్వేరుగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పదవీ కాలాన్ని సగం సగం పంచుకునే విధానాన్ని అమలు చేసే సమయం ఆసన్నమైందని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
"మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు అందరి కళ్లూ తెరిపించాయి. మిత్రపక్షాలకు, ప్రజలకు ధన్యవాదాలు. అమిత్ షా చెప్పిన ఫార్ములాను మేం పాటించాం. ముఖ్యమంత్రి పదవి విషయంలో 50-50 సూత్రం పాటించాల్సిన సమయం వచ్చింది.
ఈ ఎన్నికల్లో భాజపాకు మేం ఎక్కువ స్థానాలను కేటాయించాం. అయితే ఇది ఎప్పటికీ సాధ్యం కాదు. మా పార్టీని కూడా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది."
-ఉద్ధవ్ ఠాక్రే, శివసేన అధ్యక్షుడు